మదర్సాలో చదివే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు యూపీ సీఎం అదిత్యానాథ్ ఆదేశాలను జారీచేశారు. మదర్సా ప్రతినిధులందరితో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ మంత్రి మంత్రి మొహ్సిన్ రజా తెలిపారు. ఈ నిర్ణయంపై అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని మదర్సా పాఠశాలల్లో విద్యార్థులందరూ కుర్తా-ఫైజామా ధరించి పాఠశాలకు రావాలని, యూనిఫాం ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి తెలిపారు.
యూపీ సీఎంగా అదిత్యానాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మదర్సా పాఠశాలల్లో పలు కీలక సంస్కరణలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని మదర్సా పాఠశాలలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషన్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎన్‌సీఆర్‌టీ) సిలబస్‌ను ప్రవేశపెట్టాలని సీఎం యోగి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. మదర్సాలు ఎన్‌సీఆర్‌టీ పాఠ్యప్రణాళికను అనుసరించాలని.. సైన్స్, మ్యాథమ్యాటిక్స్, సోషల్ వంటి సబ్జెక్ట్‌లను బోధించండని యోగి కోరారు. మదర్సాలో ఆధునిక విద్యను ప్రవేశపెట్టవలసిన ప్రాముఖ్యతను పలు సందర్భాల్లో ఆదిత్యనాథ్ నొక్కిచెప్తున్నారు.
మదర్సాలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం డ్రస్ కోడ్ పెట్టడాన్ని పలువురు ముస్లిం మతాధికారులు, స్కాలర్స్ వ్యతిరేకిస్తున్నారు. 'ఈ దేశంలో నడుస్తున్న అన్ని మదర్సాలకు, కళాశాలలకు డ్రస్ కోడ్ ప్రభుత్వం నిర్ణయించలేదు. దానిపై ఆ సంస్థ యొక్క మేనేజింగ్ కమిటీదే నిర్ణయం' అని ఓ ముస్లిం మతాధికారి ఒకరు అన్నారు.