"వెలుగు దివ్వెల" పండుగ వచ్చేసింది..!

  

Last Updated : Oct 19, 2017, 01:22 PM IST
 "వెలుగు దివ్వెల" పండుగ వచ్చేసింది..!

దీపావళి.. జీవితం ప్రకాశమయమై ఆనందాల హరివిల్లులు కురిపిస్తే ఎలా ఉంటుందో తెలియజేసే గొప్ప పర్వదినం. తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ఇదే పండుగను దివ్వెల పండుగ అని కూడా అంటారట. ఆశ్వయుజ మాసంలోని క్రిష్ణ త్రయోదశి నాడు ధన త్రయోదశితో ప్రారంభయ్యే ఈ పర్వదినం, కార్తీక శుద్ధ ద్వితీయనాడు యమద్వితీయతో ముగుస్తుందన్నది పురాణ ప్రశస్తి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఇదే పండుగ అయిదు రోజులు జరగుతుంది. ఈ పర్వదిన సందర్భంగా మనం కూడా దీపావళి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం.

ఆ గోపాలుడే స్వయంగా దుష్టుడైన నరకాసురుణ్ణి తన ధర్మపత్ని సత్యభామ సహాయంతో హతమార్చిన సందర్భంలో... చెడు మీద మంచి సాధించిన విజయంగా భావించి తొలుత ద్వారకా నగరంలో జనులు దీపావళి జరుపుకొన్నారని అంటారు. అదేవిధంగా వామనవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు, ఏ విధంగా బలి చక్రవర్తి అహంకారాన్ని అణచి పాతాళానికి పంపించివేస్తాడో తెలియజేసే మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. అలాగే, రావణుడిని హతమార్చి సీతాదేవిని అయోధ్యకు రాముడు తీసుకొచ్చే రోజును కూడా పురస్కరించుకొని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు దీపావళి జరుపుకుంటారు.

విక్రమార్కుడు కూడా ఇదే రోజున పట్టాభిషక్తుడయ్యాడని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. దీపావళి పర్వదినాల్లో భాగంగా తొలిరాజు ధనతేరస్‌ అనే పండగను జరుపుకుంటారు.  లక్ష్మీదేవిని కొలిచే ఈ పండగ నాడు కొత్త బంగారాన్ని కొనడం వల్ల మంచి జరుగుతుందనేది కొందరి నమ్మకం. 

రెండవరోజు జరిగే నరకచతుర్దశి నాడు ఆడపడుచులు అభ్యంగన స్నానాలు చేసి, మంగళహారతులు ఇస్తారు. మూడవ రోజైన దీపావళి నాడు టపాకాయలు కాలుస్తూ, ఇంటినిండా దీపాలు అలంకరించి, కాంతివంతమైన లోగిళ్లకు ఆహ్వానం పలుకుతారు.

కొన్నిచోట్ల దీపావళి మరుసటి రోజైన బలిపాడ్యమి రోజున బలులతో కూడిన దీపాలు వెలిగిస్తారు.  ఇలా చేయడం వలన పరలోకాలలో ఉన్న తమ పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుందన్నది వారి విశ్వాసం. అలాగే యమద్వితీయ నాడు సోదరీమణలు, తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి షడ్రసోపేతంగా భోజనం పెట్టి, వారి ఆశీస్సులనూ పొందడం సంప్రదాయం. దీనినే ‘భగినీ హస్త భోజనం’ అని అంటారు. కొన్నిచోట్ల దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని చాలామంది కేదారీశ్వర నోమును కూడా జరుపుకుంటారు. 

కొన్ని ప్రాంతాల్లో దసరాకి చేసే పనులు దీపావళికి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉదాహరణకు  బుందేల్‌ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో దీపావళి రోజున రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తారు. సాధారణంగా విజయదశమి నాడు చేసే దహనం ఈ ప్రాంతాల్లో దీపావళినాడు చేయడం గమనార్హం. 

ఏదేమైనా.. దీపావళి పండుగ ఒక సామాజిక సందేశాన్ని అందించకనే అందిస్తుంది. ముఖ్యంగా ప్రమిదలలో చమురుపోసి వత్తులు చేసి దీపాలు వెలిగించడమనేది ఒక తాత్వికతతో కూడిన ఆచారం. చీకటిని పోగొట్టగల శక్తి దీపానికి తప్ప ఏ వస్తువుకు లేదు.. అదే విధముగా జ్ఞాన కాంతులతో అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టాలన్న ఆకాంక్షతోనే మనం ముందుకు వెళ్ళాలన్నది ఈ పండుగ మనకు అందించే ముఖ్యసందేశం

Trending News