ఏదైనా పూజ చేయాలంటే సమయానికి పూజారి దొరకడు. పూజా సామాగ్రి కొనుక్కోవడానికి దుకాణాల చుట్టూ తిరగాలి.. ఇకపై ఈ బాధలు మీకు తీరనున్నాయి. ఆన్లైన్లోనే ఒక్క క్లిక్‌తో పూజారి, పూజాసామాగ్రి, ప్రసాదం కూడా దొరుకుతున్నాయి. నిజమండీ.. ! ఆ విషయాలేంటో మీరూ చదవండి.
దసరా, దీపావళి, వ్రతాలు, పూజలు, బాసరాలు,పెళ్లిళ్లు.. ఇలా ఎటువంటి కార్యాలకైనా టైం చెప్తే చాలు వారే అన్నీ చేస్తారు. పురోహితుడిని, వంట సామాగ్రిని పంపుతారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా, ఎంచక్కా నీడపట్టున ఉంటూ పూజలకు, హోమాలకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో సేవలందించేందుకు స్టార్అప్లు చాలానే ఉన్నాయి. వాటిలో పూజ.కాం, మైపండిత్ జీ .కాం, ఆన్లైన్ పురోహిత్. కాం లాంటివి కొన్ని. తెలుగు రాష్ట్రాల్లోనే కాక, పక్క రాష్ట్రాలకి కూడా ఈ సేవలను విస్తరించారు పూజ.కాం సైట్ నిర్వాహకులు. ఇతర రాష్ట్రాల్లో మిగితా వెబ్సైట్లు సేవలు అందిస్తున్నాయి.
విదేశాల్లో ఉండే తెలుగువారు, హిందువులు వెబ్సైట్లను సంప్రదించి వీడియోచాట్ ద్వారా పూజలు జరిపించుకుంటున్నారు. ఎవరైనా అక్కడ పూజ చేయించాలంటే తేదీ, ముహూర్తం నిర్ణయించి చెబితే పూజకు అవసరమైన వస్తువుల గురించి ఇక్కడి నుంచే చెబుతారట. అలాగే పురోహితులు వీడియోలో చూస్తూ, మంత్రాలు చదువుతూ పూజ జరిపించే సౌలభ్యం కూడా ఉంది.
ఈ పూజ.కాం.ఇన్ అయితే దేశంలో ఉన్న 3000 పైగా ఆలయాల్లో మన పేరుమీద ఎక్కడి నుంచైనా హోమాలు జరిపించుకొనే అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎవరైనా ఈ సేవల్ని పొందవచ్చు. హోమాన్ని వీడియో తీసి, ప్రసాదంతో పాటు పోస్ట్ ద్వారా ఇంటికి పంపిస్తారు.