శాంతాక్లాజ్.. క్రిస్మస్ తాత.. ఇలా ఏ పేరుతో పిలిచినా అతను ఆనందంగా పలుకుతాడు. చిన్నారులతో పాటు పెద్దల కోసం కూడా ఎన్నో బహుమతులు పట్టుకొస్తాడు. క్రిస్మస్ సమయంలో శాంతాక్లాజ్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటి క్రిస్మస్ తాత నుండి మనం కూడా కొన్ని మంచి మంచి విషయాలు నేర్చేసుకుందామా..
తీసుకోవడం కన్నా.. ఇవ్వడంలోనే ఆనందం ఉంది - మనం పుట్టినరోజులప్పుడు, పెళ్లి రోజులప్పుడు బహుమతులు, కానుకలు తీసుకుంటాం. కానీ మనమే ఎవరికైనా కానుకలు ఇవ్వాలంటే మాత్రం ఆలోచిస్తుంటాం. అయితే పేదబాలలకు శాంతాక్లాజ్ కానుకలను ఇవ్వడం చూస్తుంటే.. మనకు కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్న ఆలోచన తప్పకుండా కలుగుతుంది. పవిత్రమైన రోజును పురస్కరించుకొని నలుగురికీ సహాయం చేయడం కన్నా ఆనందం ఇంకేముంటుంది
సంతోషమే సగం బలం - శాంతాక్లాజ్ ఎప్పుడూ ఎవరిమీదా కోపగించుకోడు. అందరినీ నవ్వుతూనే పలకరిస్తాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. నలుగురి మదిలో ఆనందాల హరివిల్లులను నింపడమే తన ధ్యేయంగా జీవితాన్ని మొదలుపెట్టిన శాంతాక్లాజ్‌ని స్ఫూర్తిగా తీసుకొని.. మనం కూడా జీవితంలో ఎన్ని అలజడులు ఎదురైనా.. వాటినన్నింటినీ ఎదుర్కొని సంతోషంగా జీవించడానికే ప్రయత్నించాలి.
అందరూ నాకు మిత్రులే - శాంతాక్లాజ్‌కి కులమత భేదాలు ఉండవు. అందరూ అతని మిత్రులే. కనిపించిన ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక కానుక ఇవ్వకపోతే అతనికి నిద్ర పట్టదు. అందరితో స్నేహంగా ఉంటూ.. వివక్షతను దూరం చేయాలనే భావనను మనం ఆయన నుండి పెంపొందించుకోవచ్చు.
ఆయన కథే ఆదర్శం - బాలలకు భలే మంచి నేస్తంగా మారిన క్రిస్మస్ తాత క్రీ.శ.270లో జన్మించారట. ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్. టర్కీలో బిషప్‌గా పనిచేసేవారు. శాంతా క్లాజ్ అనే పేరు పెట్టుకున్న నికోలస్ తన సంపాదన అంతా కూడా పేద విద్యార్థుల సంక్షేమం కోసం వినియోగించేవారట. క్రిస్మస్‌కు ముందురోజు రాత్రి అనగా డిసెంబర్ 24 తేదీన మంచు కురుస్తున్నా కూడా పట్టించుకోకుండా పల్లెలు, కొండ ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడి పేదపిల్లలకు కానుకలు ఇచ్చేవాడట ఆయన. నికోలస్ చనిపోయాక.. కొన్ని వేల మంది ఔత్సాహికులు శాంతాక్లాజ్ వేషం వేసుకొని.. బాలలకు కానుకలిస్తూ... ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నారు.