TPCC chief Revanth Reddy says 2 lakh jobs in the first year If Congress Form Govt in Telangana: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే.. తెలంగాణ రాష్ట్రంలోని 50 లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పభుత్వంలో నిరుద్యోగ యువత సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లో జరిగిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆదిలాబాద్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 'తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్న హామీని బీఆర్‌ఎస్ అమలు చేయడంలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువత సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. చదువుకున్న నిరుద్యోగ యువకుల వయస్సు 25 ఏళ్లు. ఇప్పుడు వారి వయస్సు 35 దాటింది. చాలా మందికి ఇప్పటివరకు ఉద్యోగాలు లేకపోవడంతో వివాహం కాలేదు. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా రాజకీయ ఉద్యోగాలు లభించాయి. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపిస్తే.. ఏడాదిలోపే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం. ప్రతి నిరుద్యోగి 1.60 లక్షల నిరుద్యోగ భృతికి అర్హులు' అని అన్నారు.
'ఎస్‌ఎస్‌సీ పేపర్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ప్రశ్నపత్రాలను భద్రంగా ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎస్‌ఎస్‌సీ పేపర్ లీక్ చేశారనే ఆరోపణలపై అరెస్ట్ చేసి.. జైలుకు పంపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరుసటి రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ సభ్యులను జైలులో ఉంచారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌కు, బీజేపీకి చాలా విషయాల్లో స్నేహపూర్వక అవగాహన ఉందన్న వాస్తవాన్ని ఇది బట్టబయలు చేస్తోంది. పేపర్ లీక్ ఘటనకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను తప్పించాలి. పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రస్తుతం ఉన్న టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి.. కొత్త బోర్డును నియమించాలి' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
'ముస్లింలకు కాంగ్రెస్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది. ముస్లిం రిజర్వేషన్ కోటాను 12 శాతానికి పెంచుతామని బీఆర్‌ఎస్ హామీ ఇచ్చి నేటికీ చేయలేదు. మరోవైపు బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని చెబుతోంది. రిజర్వేషనే రద్దు చేస్తామన్న బీజేపీ వైపు ఉంటారో లేదా రిజర్వేషన్ ఇచ్చిన కాంగ్రెస్ వైపు ఉంటారో ముస్లిం సోదరులు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ప్రతీ అభివృద్ధి పని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిందే. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు, యువత వచ్చే ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. రాష్ట్రంలో 90 సీట్లను గెలుచుకోవచ్చు. కొత్త ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మంచి రోజులు వస్తాయి' అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.