Karnataka Exit Polls 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి..ఫలితాల కోసం నిరీక్షించే సమయం. మే 13వ తేదీన జరిగే కౌంటింగ్ ఎవరి జాతకమేంటో చెప్పనుది. ఈ క్రమంలో వెలువడిన వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి. కొందరిలో ఉత్సాహాన్ని మరి కొందరిలో నిరుత్సాహాన్ని రేపుతున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే..వివిధ సంస్థలు ఒకదాని తరువాత మరొకటిగా ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం విశేషం. న్యూస్ నేషన్ సీజీఎస్, సువర్ణ న్యూస్ మినహా అన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనుందని తెలిపాయి. విశేషమేమంటే జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ సర్వేలు సైతం బీజేపీ వెనుకంజలో ఉంటుందని వెల్లడించాయి.
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ 2023లో టీవీ 9 భారత్ వర్ష్, పీపుల్స్ పల్స్, రిపబ్లిక్ టీవీ, ఏబీపీ-సీ ఓటర్, సౌత్ ఫస్ట్, పోల్ స్ట్రాట్, సువర్ణ న్యూస్, న్యూస్ నేషన్ సీజీసీ, జీ న్యూస్ వంటి సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంటుందని అంచనా వేస్తే..సువర్ణ న్యూస్, న్యూస్ నేషన్ సీజీఎస్ మాత్రం బీజేపీ మరోసారి అధికారం దక్కించుకుంటుందని వెల్లడించాయి.
మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికారానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 113. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకు 86 నుంచి 119 స్థానాలు వస్తాయని తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకు 103-118 స్థానాలు రావచ్చని జీ న్యూస్ లెక్కగట్టింది. అటు టీవీ 9 భారత్ వర్ష్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకు 99-109 స్థానాలు లభించవవచ్చు. పీపుల్స్ పల్స్ సంస్థ అయితే కాంగ్రెస్ పార్టీకు 107-119 స్థానాలు రావచ్చని తేల్చింది. ఏబీపీ సీ ఓటర్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకు 100-112 స్థానాలు రానున్నాయి.
ఈ సర్వేలో దాదాపు అన్ని సంస్థలు బీజేపీకు మాత్రం 78- 100 లోపే ఇస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ సైతం కాంగ్రెస్ పార్టీకు 94-108 స్థానాలు వస్తాయని అంచనా వేస్తుండగా బీజేపీకు 85-100 స్థానాలు వస్తాయని తెలిపింది. మరో సర్వే సంస్థ ఆత్మ సాక్షి ప్రకారం కాంగ్రెస్ పార్టీ 117-124 స్థానాలు గెల్చుకోనుండగా బీజేపీ 83-94 స్థానాలకు పరిమితం కానుంది.
ఇక న్యూస్ నేషన్ సీజీసీ సంస్థ జరిపిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీకు గరిష్టంగా 114 స్థానాలు వస్తాయని చెప్పగా, సువర్ణ న్యూస్..బీజేపీ 94-117 స్థానాలు వస్తాయని వివరించింది.. జనతాదళ్ సెక్యులర్ పార్టీ మాత్రం దాదాపు అన్ని సంస్థల సర్వేల ప్రకారం 21-26 స్థానాలు గెల్చుకోనుంది.
గత ఎన్నికల్లో పార్టీల బలాబలాలు
వాస్తవానికి కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మేజిక్ ఫిగర్ రాకపోవడంతో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటును ఉపయోగించుకుని బీజేపీ అధికారం దక్కించుకుంది. అంతకుముందు 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లతో ఘన విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది. ఇక 2008 ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లు సాధించి ఇతరుల మద్దతుతో అధికారం చేపట్టింది.
కర్ణాటకలో అధికారానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 113. ఈ సంఖ్యను కాంగ్రెస్ పార్టీ సులభంగా చేరుకోనుందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే సర్వే ఫలితాలు ఎప్పుడూ 2 -3 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటాయి. అదే జరిగితే మేజిక్ ఫిగర్ కష్టం కావచ్చు. ఈ క్రమంలో 21-26 సీట్లు గెల్చుకోవచ్చని భావిస్తున్న జనతాదళ్ సెక్యులర్ పార్టీ కీలకం కానుంది. అందరి దృష్టి ఈ పార్టీపైనే పడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook