Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం ఘటన దేశమంతట్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్ని అత్యంత భయంకర ప్రమాదంలో 278 మంది ప్రాణాలు కోల్పోగా వేయికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనపై విచారణలో సందేహాస్పద విషయాలు బయటపడుతున్నాయి.
ఒడిశా బాలాసోర్ సమీపంలోని బహానగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద లూప్లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్ నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీ కొట్టింది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఢీ కొట్టడంతో 7-8 భోగీలు పట్టాలు తప్పి పక్కకు దొర్లిపోయాయి. కొన్ని భోగీలు గాల్లో లేచాయి. ఈలోగా అదే సమయంలో పక్కన ఉన్న మెయిన్ ట్రాక్‌పై యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ చివరి భోగీలు కోరమాండల్ భోగీల్ని ఢీ కొట్టడంతో ఆ రైలు కూడా పట్టాలు తప్పింది. వెరసి ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం కావడంతో సీబీఐకు దర్యాప్తు అప్పగించారు.
ఈ ఘటనలో విచారణ వేగవంతమౌతోంది. ముఖ్యంగా ఐదుగురు ఉద్యోగుల్ని రైల్వే అధికారులు విరామం లేకుండా విచారిస్తున్నారు. రైళ్లు ఢీ కొనకుండా కాపాడే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ట్యాంపరింగ్ జరిగిందా, సాంకేతిక లోపమేనా, నిర్లక్ష్యమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే బహానగ బజార్ రైల్వే స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మేనేజర్ సహా ఐదుగురు ఉద్యోగుల్ని విధుల్నించి తొలగించి విచారణ జరుపుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు ఉద్యోగులు సిగ్నలింగ్ సంబంధిత పనులు నిర్వహిస్తున్నారు. రైళ్లు ఢీ కొట్టుకోకుండా ప్రమాదాలు జరగకుండా సిగ్నలింగ్ వ్యవస్థను నియంత్రించేది ఇంటర్ లాకింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థలో ట్యాంపరింగ్ జరిగిందనేది రైల్వే శాఖ అనుమానం. ఇది కాకుండా మరో మూడు కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇంటర్ లాకింగ్ వ్యవస్థను కావాలని ట్యాంపరింగ్ చేశారా, పొరపాటున జరిగిందా, లేదా ఆ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే పనుల వల్ల జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై సీబీఐకు దర్యాప్తు అప్పగించినా అప్పటికే విచారణ ప్రారంభించిన కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ దర్యాప్తును కొనసాగిస్తోంది. ప్రమాదం జరిగిన స్టేషన్‌తో పాటు సమీపంలోని స్టేషన్లలో కూడా సిబ్బందిని ప్రశ్నించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook