పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మోదీ లేఖ రాశారట

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తెలిపారు.

Last Updated : Aug 20, 2018, 09:39 PM IST
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మోదీ లేఖ రాశారట

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తెలిపారు. భారత ప్రధాని ఆ లేఖలో ఇమ్రాన్ ఖాన్‌కి కొత్తగా ప్రధాని బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలిపారని.. అలాగే భవిష్యత్తులో ఇరు దేశాలు పలు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారని ఖురేషీ అన్నారు. తాజాగా పాక్ విదేశాంగ మంత్రి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. తాను కూడా భారత్, పాకిస్తాన్ దేశాలు వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చర్చలకు శ్రీకారం చుడితే బాగుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.

గతంలో ఈ ఇరు దేశాలు ఇదే ఆలోచన చేశాయని ఆయన తెలిపారు. "భారత్, పాకిస్తాన్ దేశాలు ఇరుగు పొరుగు దేశాలుగా ఉన్నప్పటికీ.. ఈ రెండు దేశాలకు సంబంధించి పరిష్కారం కానీ సమస్యలైతే కొన్ని ఉన్నాయి. అవేంటో అందరికీ తెలుసు. ఈ సమస్యలు కొన్ని సందర్భాల్లో క్లిష్టంగానూ మారుతున్నాయి. అయినా పరిష్కారం కోసం కలిసి మాట్లాడుకుంటే మంచిది. కాశ్మీర్ అనేది ఒక వాస్తవిక రూపం. అలాగే ఇస్లామాబాద్ డిక్లరేషన్ మన చరిత్రలో ఒక భాగం. చర్చలప్పుడు ఈ విషయాలు అన్నీ పరిగణనలోకి తీసుకోవాలి" అని ఖురేషీ అన్నారు. 

ఇమ్రాన్ ఖాన్ కూడా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశాక ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాము సరిహద్దు దేశాలు అన్నింటితో కూడా చర్చలు జరుపుతామని.. శాంతి స్థాపన అనేదే తమ అభిమతమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్‌లో ప్రస్తుతం 15 మంది ఫెడరల్ మంత్రులు ఉన్నారు. విదేశాంగ మంత్రిగా షా మెహమూద్ ఖురేషీ బాధ్యతలు స్వీకరించగా.. రక్షణ మంత్రిగా పర్వేజ్ ఖట్టక్, ఆర్థిక మంత్రిగా అసద్ ఉమర్, విద్యాశాఖ మంత్రిగా షఫ్కత్ మెహమూద్, ఆరోగ్యశాఖ మంత్రిగా అమిర్ కియానీ బాధ్యతలు స్వీకరించారు.

Trending News