శతాబ్ద కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళను ఇటీవల వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా కేరళ రాష్ట్రానికి దాదాపు రూ. వేల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో దేశవ్యాప్తంగా అనేక సంస్థలు, వ్యక్తులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేరళకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సాయం కావాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీలందరినీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వాలంటూ అభ్యర్థించారు.
సోమవారం ఫేస్బుక్ వేదికగా స్పందించిన ఆయన... ‘‘మలయాళీలంతా కలిసికట్టుగా నిలబడితే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించగలం. కేరళను పునర్నిర్మించేందుకు నిధులకు కొరత ఉండదు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీలంతా ఒకనెల జీతాన్ని విరాళంగా ఇద్దామనే దాని గురించి ఆలోచించాలని కోరుతున్నా...’’ అని పిలుపునిచ్చారు. ఒకేసారి నెలరోజుల జీతం ఇవ్వలేని వారు.. పది నెలల కాలంలో విడతల వారీగా ఆ మొత్తాన్ని ఇవ్వొచ్చన్నారు. కేరళకు సహాయం చేసేలా తోటివారిని ఒప్పించాలని ఆయన మలయాళీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.