Minister Prashanth Reddy Comments on BJP and Congress: కాంగ్రెస్, బీజేపీ మోసపు హామీలు, మాటలు నమ్మి మోసపోవద్దు అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో అర్హులైన లబ్ధిదారులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ వల్ల లబ్ది పొందిన వారు, లబ్ది పొందుతున్న వారు ఆలోచన చేయాలనీ మంచి చేస్తున్న కేసిఆర్ ను, తనను మళ్ళీ ఆశీర్వదించాలనీ కోరారు.
తెలంగాణ ప్రజలందరూ కేసిఆర్ సంక్షేమ పథకాల లబ్దిదారులే అని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ప్రజలకు కేసిఆర్ సర్కార్ ఆసరగా నిలుస్తోందని అన్నారు. 200 పెన్షన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 4వేల పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. 200రూపాయలు ఉన్న పెన్షన్లు 2000వేలు చేసింది కేసిఆర్ కాదా ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు 2వేల పెన్షన్ ఇస్తున్నది కేసిఆర్ వచ్చిన తర్వాత మాత్రమే అని అన్నారు.
ఎవరు ప్రజల మేలు కోరే వారు, ఎవరు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నారో గమనించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. ఒక్క సారి ఓట్లు డబ్బల పడగానే మొహం చాటేస్తారని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పువ్వు గుర్తు బీజేపీ 4 వందల గ్యాస్ సిలిండర్ 1200 చేశారు. డీజిల్,పెట్రోల్ ధరలు పెంచారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పేద, మధ్య తరగతి ప్రజలు గోస పడుతున్నారనీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ కేవలం దేశం పేరు, దేవుని పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుతోంది అని, మన ఇంటికి ఏం చేస్తారో చెప్పకుండా పనికి వచ్చే మాటలు చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాక ముందు దేవునికి మొక్కలేదా ? వాళ్లు చెప్తేనే ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నామా ? అని ప్రశ్నించారు.