అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది చిన్నపిల్లాడి మనస్తత్వమని అమెరికా మాజీ స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ తెలిపారు. కెర్రీ ఇరాన్ ప్రభుత్వంతో అమెరికా చట్టాన్ని ఉల్లంఘించి చర్చలు కొనసాగిస్తున్నారని ఇటీవలే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల పై స్పందిస్తూ కెర్రీ మాట్లాడారు. "ట్రంప్‌ది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎనిమిదేళ్ల కుర్రాడికి కూడా ఓ టీనేజ్ అమ్మాయికి ఉండే అభద్రతాభావం ఉంటుంది. అచ్చం ట్రంప్ మనస్తత్వం కూడా అదే. ట్విట్టర్‌లో పోస్టులు పెడుతూ కాలం గడిపే బదులు.. అమెరికన్ రాజ్యాంగ పుస్తకాలను చదివితే నాలెడ్జి పెంచుకుంటే బాగుండేది. ట్విట్టర్ లైకుల కోసం పాకులాడే తొలి అమెరికా ప్రధాని ట్రంప్ మాత్రమే" అని కెర్రీ చురకలంటించారు.
"మా ఖర్మ కాలి ఆయన మాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. నిజానికి.. అసలైన నిజానికి.. నికార్సైన నిజానికి ఆయనకు తేడా తెలియదు. మూడు వేరు వేరు అనుకుంటారు. కానీ అన్ని నిజాలే అన్న విషయాన్ని ఆయన మర్చిపోతారు. అచ్చం ఎనిమిదేళ్ల పిల్లాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఈయన కూడా ప్రవర్తిస్తున్నారు" అని కెర్రీ ట్రంప్‌ను ఎద్దేవా చేశారు.
అయితే కెర్రీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ చర్చలోకి టీనేజ్ అమ్మాయిల ప్రస్తావనను తీసుకురావడాన్ని కొందరు తప్పు పట్టారు. ఈ క్రమంలో కెర్రీ మద్దతుదారుడైన మాట్ సమ్మర్స్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. "అమెరికన్ స్టేట్ సెక్రటరీగా పనిచేసిన ప్రతీ వ్యక్తికి కూడా వివిధ దేశాల ప్రముఖలతో పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలను బట్టి అప్పుడప్పుడు వారు మాట్లాడుకోవచ్చు. ఇందులో పెద్ద తప్పుపట్టాల్సిన అంశమేమీ లేదు" అన్నారు. అయితే 2015లో ఇరాన్‌తో అమెరికా సంబంధాలు బలోపేతం చేయడంలో కెర్రీ పాత్ర కూడా ఉంది.