అరకు ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడికి కారణాలివేనా..?

విశాఖపట్నం మన్య ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి తమ ప్రాబల్యాన్ని చూపించారు. అరకు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావుపై కాల్పులు జరపగా...ఆయన అక్కడిక్కడే మరణించారు.

Last Updated : Sep 23, 2018, 06:30 PM IST
అరకు ఎమ్మెల్యేపై మావోయిస్టుల దాడికి కారణాలివేనా..?

విశాఖపట్నం మన్య ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి తమ ప్రాబల్యాన్ని చూపించారు. అరకు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి సర్వేశ్వరరావుపై కాల్పులు జరపగా...ఆయన అక్కడిక్కడే మరణించారు. ఇవే కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ కూడా ప్రాణాలు కోల్పోయారు. డంబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్టు ప్రాంతంలో మావోయిస్టులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ నిర్ధారించడంతో పాటు అదనపు బలగాలను కూడా ఘటన జరిగిన ప్రాంతానికి పంపించడం జరిగింది. ఈ దాడిలో దాదాపు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ పర్యవేక్షణలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ దాడికి అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ రోజు ఉదయం వరకు కిడారి సర్వేశ్వరరావు అరకులోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సోమతో కలిసి ఆయన గ్రామస్తులతో మాట్లాడడానికి వెళ్లారు. కానీ ఆకస్మాత్తుగా 60 మంది మావోయిస్టులు.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి రౌండప్ చేశారు. చాలాసేపు మావోయిస్టులకు, కిడారి సర్వేశ్వరరావులకు మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో క్వారీ సమస్యల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది.

అయితే ఈ చర్చల సందర్భంగానే మాటా.. మాటా పెరిగి ఎమ్మెల్యేకి, మావోయిస్టులకు మధ్య వాగ్వివాదం జరిగిందని.. ఈ క్వారీ పనుల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని మావోయిస్టులు చెబుతూ... వెంటనే క్వారీ పనులు ఆపాలని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయంపై జరిగిన మాటలు ఘర్షణ స్థాయికి వెళ్లాయని... ఈ క్రమంలో మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పై కూడా మూడు రౌండ్లు కాల్పులు జరపగా.. వారు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా విశాఖ మన్యం ప్రాంతంతో పాటు ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేయడంతో.. మావోయిస్టుల కార్యకలాపాలు చాలా వరకు నిలిచిపోయాయి. కానీ మళ్లీ ఈ మధ్యకాలంలో వారు గ్రామాల్లోకి రావడం ప్రారంభిస్తున్నారు.

కొన్ని కార్యక్రమాలను బహిరంగంగానూ చేస్తున్నారు. పోలీసులు కూడా భద్రత లేకుండా ఎవరినీ బయటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి.. కార్యక్రమాలకు హాజరు కావాలని గతంలో తెలిపారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే గ్రామసభలకు వెళ్లడం వల్ల ఈ అనర్థం జరిగిందని కూడా పోలీసులు చెబుతున్నారు. 

కాగా.. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం ఈ దాడిని ఖండించారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సోమ చేసిన సేవలను కొనియాడవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మానవత్వం లేకుండా ఇలాంటి దాడులు, హత్యలు జరగడాన్ని అందరూ ఖండించాలని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. 

 

Trending News