పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బాంబు పేలుడు తీవ్ర కలకలం సృష్టించింది. కోల్‌కతాలోని డమ్‌డమ్ నగర్ బజార్ ఏరియాలో ఉదయం 9.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.డమ్‌డమ్ నగర్ బజార్ ఏరియాలో మంగళవారం ఉదయం పండ్ల దుకాణాలు తెరుచుకుంటున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళాలను కూడా రప్పించారు. క్షతగాత్రులను ఆర్‌జి నగర్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. మరోవైపు, సీఐడీకి చెందిన బాంబు నిర్వీర్య బృందం, ఫోరెన్సిక్ బృందాలు అక్కడికి చేరుకొని బాంబు పేలుడుకు సంబంధించిన కారణాలను పరిశీలిస్తున్నారు.
‘ఈ పేలుడు తీవ్రత ఎక్కువ. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన చోట కొన్ని ఇనుప ముక్కలు దొరికాయి. అయితే.. ఘటనా స్థలంలో గన్‌పౌడర్ వాసన ఏమీ లేనందున పేలుడికి కారణమేమిటనేది ఇప్పుడే చెప్పలేము’ అని బాంబు నిర్వీర్వ బృందానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
గతంలో ఆర్‌ఎస్‌ఎస్ పాల్పడిన పేలుళ్ల తరహాలోనే ఈ పేలుడు కూడా ఉందని పశ్చిమ బెంగాల్ మంత్రి పూర్ణేంద్ర బసు మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. కాగా.. పేలుడు కారణాలు, ఇందుకు ఎవరు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.