ఉగండా దేశంలో ఓ మహిళ చిత్రమైన వివాహానికి శ్రీకారం చుట్టింది. పెళ్లి చేసుకోమని ఎప్పుడూ అడిగే తన తల్లిదండ్రులకు వైవిధ్యమైన రీతిలో ఓ సందేశాన్ని ఇవ్వాలని అనుకుంది. అందుకే వివాహానికి తాను సిద్ధమేనని.. కానీ తనకు నచ్చిన వారినే వివాహం చేసుకుంటానని ఆమె తెలిపింది. వారు కూడా అందుకు ఒప్పుకున్నారు. అయితే తెల్లని గౌను ధరించి వివాహ వేదికకు వచ్చిన ఆ మహిళ తనకు తానంటేనే ఇష్టమని.. తనను తానే వివాహం చేసుకుంటానని తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు చదువుకోవడం ఇష్టమని.. కెరీర్ మీద తనకు అనేక ఆశలు ఉన్నాయని.. అయినా తల్లిదండ్రులను నొప్పించడం తనకు ఇష్టం లేదని.. అందుకు ఈ విధంగా వివాహం చేసుకొని వారి కోరిక తీర్చానని ఆమె తెలిపింది.
అయితే 32 ఏళ్ల లూలు జెమిమా చేసుకున్న ఈ వివాహానికి ఆమె తల్లిదండ్రులు హాజరు కాలేదు. ఆమె ఇలాంటిదేదో చేస్తాదని తాము ముందే ఊహించామని వారు తెలిపారు. ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలన్నదే తన కోరికని జెమిమా తెలిపింది. తనను తన తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని కూడా జెమిమా తెలియజేసింది.
ఒక రకంగా ఇది ఖర్చు లేని పెళ్లి అని కూడా జెమిమా తెలిపింది. తాను పెట్టిన ఖర్చు కేవలం 2.62 డాలర్లు మాత్రమేనని.. అది కూడా ట్రాన్స్ పోర్టు ఖర్చని ఆమె పేర్కొంది. అలాగే వివాహ ఫంక్షన్ కోసం తాను ధరించిన కోటు కూడా ఓ మిత్రురాలు గిఫ్ట్‌గా ఇచ్చిందని జెమిమా చెప్పింది. వెడ్డింగ్ కేకును కూడా తన సోదరుడు బహుమతిగా ఇచ్చాడంది. పైగా ఈ వేడుకకు కూడా వచ్చే అతిధులు భోజనానికి సంబంధించి ఎవరి బిల్లు వారే చెల్లించాలని ముందే చెప్పామని ఆమె తెలపడంతో మీడియా వాళ్లు కూడా కంగుతిన్నారు. దీనికి ఓ చిత్రమైన పెళ్లిగా పలు కథనాల్లో పేర్కొన్నారు.