KCR Vs Revanth Reddy: పాలనకు సమయమిచ్చి పోరాటం చేద్దామనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు కాకముందే ప్రజల నుంచి తీవ్ర విమర్శలు పొందుతోందని గులాబీ దళపతి కేసీఆర్ తెలిపారు. అధికారమే పరమావధిగా ఎన్నికల్లో అడ్డగోలు హామీలిచ్చి, గ్యారంటీల పేరుతో ప్రజలకు ఆశలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చిందని విమర్శించారు. గ్యారంటీలను నెరవేర్చాలని ప్రజలు అడుగుతుంటే.. సమాధానమివ్వడం చేతకాక నాలుక మడతేసి అబద్దాలు, బెదిరింపులకు దిగిందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలపై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని రెండు స్థానాలపై చర్చించారు.
Also Read: MP Candidates: బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన.. ఇద్దరు సిట్టింగ్‌లకు, మరో ఇద్దరు మాజీలకు చాన్స్
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. సమాలోచనలు చేసిన అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన దిగజారిపోతోందని, వంద రోజులు కాకముందే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుంటోందని తెలిపారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాలకు ప్రభావితమై మంచిచేసే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దూరం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయని వివరించారు. మోసపోయిన సంగతి గ్రహించి తర్వాత కొద్దిరోజులకే ఆయా ప్రభుత్వాలను ప్రజలు తిరిగి ఆదరించారని గుర్తుచేశారు.
Also Read: Kallu Bar: తాగుబోతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. మందు బార్ల మాదిరి కొత్తగా 'కల్లు బార్లు'
కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీరు, విద్యుత్ వంటి కనీస అవసరాలను తీర్చలేకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారని కేసీఆర్ చెప్పారు. పాలనలో డొల్లతనాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ బయటేసుకుంటూ ప్రజల్లో అభాసుపాలవుతోందని వివరించారు. గెలుపోటములు సహజమని గుర్తించి ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని నాయకులకు సూచించారు. ఉద్యమకాలం నుంచి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ పనిచేస్తోందని, అదే స్ఫూర్తిని పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగించాలని చెప్పారు. ఈ సందర్భంగా పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేశారు.
కరువు కోరల్లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని కేసీఆర్ వివరించారు. నాడు బండలా ఉన్న పాలమూరును సస్యశ్యామలం చేసి పచ్చని పంటలతో ధాన్య రాసులతో బంగారు కొండలా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను ఆటంకపరచడమే లక్ష్యంగా కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. కొడంగల్‌కు ఎత్తిపోతల పథకాన్ని మార్చడం సరియైన నిర్ణయం కాదని చెప్పారు.
పార్టీని వీడుతున్న వారిని ఉద్దేశించి కేసీఆర్ 'ఎప్పడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు' అనే సుమతి శతకాన్ని ఉదహరించారు. కష్టకాలంలో ప్రజలతో నిలిచినవారే నిజమైన ప్రజా నాయకులని స్పష్టం చేశారు. వెళ్లిపోయే వారి గురించి ఆలోచించకుండా కలిసికట్టుగా పని చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. బీఎస్పీతో పొత్తుపై స్పందిస్తూ.. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా.. దీర్ఘకాలిక లక్ష్యంతోనే బీఎస్పీతో పొత్తు చేసుకున్నట్లు కేసీఆర్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన శక్తులను కూడదీసుకోవాలని, కలిసి వచ్చే భావసారూప్య శక్తులను కలుపుకొని పోవాలని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి