ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలు ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ప్రశాంతంగా తిరిగే పరిస్థితి లేదంటే ఇక్కడి దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడికి పాల్పడ్డారు. అలాగే తనపై కూడా ఓసారి దాడి జరిగిందని చెబుతూ.. సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సైతం దాడికి కుట్రలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించినట్టుగా ఓ తెలుగు దినపత్రిక పేర్కొంది. పవన్ కల్యాణ్‌పై దాడికి కుట్రలు జరుగుతున్నాయని కన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనియాంశమయ్యాయి. అన్నింటికిమించి ఆత్మహత్య చేసుకోబోయే వ్యక్తి సూసైడ్ నోట్ రాసిపెట్టుకోవడం చూశాం కానీ.. ఇలా ఒకరిపై హత్యాయత్నం చేయాలనుకునే వ్యక్తి జేబులో లేఖ రాసిపెట్టుకోవడం మాత్రం తాను ఒక్క టీడీపీ ప్రభుత్వంలోనే మొదటిసారిగా చూస్తున్నానని చంద్రబాబుని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఉన్నారు కనుకే మాజీ డీజీపీ ప్రసాద్ రావుకి ఇంకా ఏడాది సర్వీస్ ఉండగానే అతడిని తప్పించి... చంద్రబాబు తన బంధువును డీజీపీగా నియమించుకున్నారని కన్నా విమర్శించారు. చంద్రబాబు తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐలో తన బంధువును నియమించుకోలేదని అన్నారు.