BRS Party: 24 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరి

BRS Party Foundation Day Special Party History BRS Party History Full Details: ప్రాంతంతో పేరుతో పార్టీ ఏర్పాటై ఆ కలను సాధించుకుని అభివృద్ధి పథంలో నడిపిన బీఆర్‌ఎస్‌ పార్టీ నేడు 24వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పార్టీ చరిత్ర అంతా పోరాటమే.. ఆ పార్టీకి కేసీఆరే ఊపిరి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 27, 2024, 11:01 AM IST
BRS Party: 24 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరి

BRS Party History: పోరాటాన్నే ఊపిరిగా చేసుకుని.. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా దూసుకెళ్లి రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. దాదాపు పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్‌ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి నేటితో 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ పడిలోకి అడుగుపెట్టింది. సమైక్యాంధ్రలో బందీ అయినా తెలంగాణను స్వేచ్ఛా వాయువులు పీల్చడంలో గణనీయపాత్ర పోషించిన పార్టీ నాటి టీఆర్‌ఎస్‌. నేడు పేరు మారినా జెండా మారలేదు. గుర్తు మారలేదు. 14 ఏళ్ల పాటు ఉద్యమ కాగడ వెలిగించి.. సాధించిన తెలంగాణను పదేళ్లు అభివృద్ధి పథాన నడిపింది. అనూహ్యంగా ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం మళ్లీ పాత కష్టాలు ఎదుర్కొంటోంది.

Also Read: KCR Bus Yatra: నా వయసైపోతుంది.. యువకుల్లారా ఇక తెలంగాణ మీదే: కేసీఆర్‌

 

ఆవిర్భావం
తెలుగు దేశంలో పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. ఉప సభాపతితోపాటు టీడీపీ సభ్యత్వానికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌లోని దివంగత కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివాసం జలదృశ్యంలో 27 ఏప్రిల్‌ 2001న తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్‌ స్థాపించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆధ్వర్యంలో ఈ పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఉద్యమ పార్టీగా అవతరించింది. 17 మే 2001లో కరీంనగర్‌లో సింహ గర్జన పేరిట నిర్వహించిన బహిరంగ సభతో ఉమ్మడి ఏపీలో ప్రకంపనలు రేగాయి. అనంతరం ఎన్నో ఉప ఎన్నికలు, అనేక ఉద్యమాలు నడిపి చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పార్టీ లక్ష్యం నెరవేర్చుకుంది. తెచ్చిన తెలంగాణను పదేళ్లపాటు పాలించింది.

Also Read: KCR Live: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నేనే రిపేర్‌ చేస్తా: కేసీఆర్

 

పార్టీ పేరు మార్పు
4 అక్టోబర్‌ 2022న దసరా పండుగ రోజు టీఆర్‌ఎస్‌ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. పొరుగు మహారాష్ట్రలో ప్రధాన దృష్టి సారించి అక్కడ పార్టీ కార్యాలయం కూడా నిర్మించారు. జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించారు. 9 డిసెంబర్‌ 2022న టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ అధికారికంగా గుర్తించింది. 18 జనవరి 2023న బీఆర్‌ఎస్‌ పార్టీ తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో జరిగింది. ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

శాసనసభలో బీఆర్‌ఎస్‌ ప్రస్థానం
2004లో 26 ఎమ్మెల్యేలు కారు గుర్తుపై గెలిచారు.
2008లో తెలంగాణ సాధన కోసం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా 7 మంది గెలిచారు.
2009లో పోటీ చేసిన 45 స్థానాల్లో 11 గెలిచింది.
2011, 12లో 1, 4 చొప్పున ఎమ్మెల్యే సీట్లు సాధించింది. 
తెలంగాణ ఏర్పాటు అనంతరం 2004లో 63 సీట్లు గెలిచింది.
2018లో 88 స్థానాలు సొంతం చేసుకుంది.
2023లో 39 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది.

లోక్‌సభలో
2004లో 5
2008లో 2
2009లో 2
2014లో 11
2019లో 9 ఎంపీ స్థానాలు దక్కాయి.

ఎన్నో ఒడిదుడుకులు
ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు ఆ పార్టీకి కొత్త కాదు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ తీవ్రంగా దాడి చేసింది. 2005లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేను నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేర్చుకుని టీఆర్‌ఎస్‌ పార్టీని బలహీనపర్చారు. 2009లో పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ లాగేసుకుంది.

పూర్వ వైభవం సాధ్యమా?
పదేళ్ల పాటు అధికారంలో ఉండి అకస్మాత్తుగా అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ గడ్డు రోజులు ఎదుర్కొంటోంది. పార్టీ ఫిరాయింపులు, నాయకుల వలసలతో ఆ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటితే ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. తక్కువ స్థానాలు పొందితే మాత్రం కాంగ్రెస్‌ పార్టీ బీఆర్‌ఎస్‌ను పూర్తిగా కుప్పకూల్చే అవకాశం లేకపోలేదు.

బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర

ఆవిర్భావం: 27 ఏప్రిల్‌ 2001
పార్టీ పేరు: భారత రాష్ట్ర సమితి 
పూర్వ నామం: తెలంగాణ రాష్ట్ర సమితి
వ్యవస్థాపకులు: కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు
పార్టీ గుర్తు: కారు
పార్టీ రంగు: గులాబీ
పార్టీ కార్యాలయం: తెలంగాణ భవన్‌, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.
పార్టీ సభ్యత్వం: 60 లక్షలకు పైగా
ప్రత్యేకతలు: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు. మొదట ఉద్యమ పార్టీ అనంతరం రాజకీయ పార్టీగా రూపాంతరం.
- దేశంలోనే అత్యధిక ఆస్తులున్న ప్రాంతీయ పార్టీ.
- పదేళ్లు అధికారం సొంతం.
- ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకుని నిలబడడం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News