సంగారెడ్డి: ఆమె మొన్నటివరకు ఐదేళ్లు గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. సర్పంచ్‌గా పనిచేసిన అనుభవానికితోడు ఇంకాస్త శ్రమించి, పుస్తకాలు తిరగేసి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం రాశారు. సీన్ కట్ చేస్తే నిన్న వెల్లడైన పంచాయతీ సెక్రటరీ ఫలితాల్లో తన పేరు ఉండటం ఆమెను అమితానందంలో ముంచెత్తింది. ఆమె ఎవరో కాదు.. సంగారెడ్డి జిల్లా కాల్బగూర్ గ్రామ మాజీ సర్పంచ్ తలెల్మ వనజ(32). చిన్న వయస్సులోనే సర్పంచ్ అవడంతోపాటు తాను సర్పంచ్‌గా ఉన్నప్పుడు తన బాధ్యతల గురించి తెలుసుకోవడంతోపాటు ఆ విధులను విజయవంతంగా నిర్వహించానని... అందువల్లే గ్రామాభివృద్ధిలో ఎవరి పాత్ర ఏ మేరకు ఉంటుందో తెలుసుకున్న తాను పంచాయతీ సెక్రటరి పరీక్ష రెండో పేపర్లో ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి అందులో విజయం సాధించానని ఆమె తెలంగాణటుడేకు తెలిపారు.
Also read : మీ ఓటు హక్కు గల్లంతయ్యిందా ? ఓటర్ ఐడీ వివరాల్లో తప్పులున్నాయా ? అయితే ఇది మీకోసమే..
తెలంగాణటుడే ప్రచురించిన ఓ కథనం ప్రకారం కాల్బగూర్ గ్రామంలోనే పుట్టి పెరిగిన వనజ.. అదే గ్రామానికి చెందిన రైతు తలెల్మ జనార్థన్‌ను పెళ్లి చేసుకున్నారు. జనార్థన్-వనజ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. బీఎస్సీ, బీఎడ్ పూర్తిచేసిన వనజ.. 2013 నుంచి 2018 వరకు కాల్బగూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పని చేశారు. ఓవైపు గ్రామాభివృద్ధిలో పాల్పంచుకుంటూనే మరోవైపు తన కొడుకులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆమె ఈ విజయం సాధించడం విశేషం.
పంచాయతీ సెక్రటరీ పరీక్షతోపాటే డీఎస్సీ, హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ ఎగ్జామ్స్ కూడా రాశాను. ప్రస్తుతానికి పంచాయతీ సెక్రటరీ పరీక్షలో విజయం సాధించిన తనకు డీఎస్సీ, వార్డెన్ ఉద్యోగాల్లో కూడా విజయం వరిస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తంచేశారు. ''మొన్నటివరకు సర్పంచ్... ఇకపై పంచాయతీ సెక్రటరీ'' అని గ్రామస్తులందరూ తనని అభినందిస్తుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని సంతోషం వ్యక్తంచేశారామె. తనకు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా.. తాను తన విధులు నిర్వర్తిస్తూనే, తన గ్రామాన్ని సైతం అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానంటున్న వనజ ఆ గ్రామానికి చెందిన యువతకేకాకుండా ఇంకెందరికో ఆదర్శంగా నిలిచారు.