ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డోర్ డెలివరీ కోసం రోబోలను వినియోగం తీసుకురావాలనే ప్రయత్నాన్ని మొదలెట్టింది. అమెజాన్‌లో కొనుగోలు చేసిన వస్తువులను ఈ రోబో ద్వారా వినియోగదారులకు డోర్‌డెలివరీ చేసే విధంగా దీనిని అభివృద్ధి చేశారు. ప్రయోగాత్మకంగా దీన్ని వాషింగ్టన్‌లోని స్నోహోమిష్ కంట్రీలో పరిశీలించారు. ఆయా వీధుల్లోని కాలిబాటలపై తేలికగా ఇవి తిరిగేలా వీటిని రూపొందించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే కళాశాలల్లో విద్యార్థులకు ఫాస్ట్‌ఫుడ్, చిరుతిళ్లు అందించేందుకు రోబోల వినియోగించాలని అమెజాన్ భావిస్తోంది
రోబో డెలివరీ అంశంపై అమెజాన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రోబో వెంట ఓ ఉద్యోగి అనుసరిస్తూ ప్రాథమికంగా దీని పనితీరును పరిశీలిస్తున్నామని .. దీని పనితీరు సక్సెస్ ఫుల్ గా ఉంటే.. మరిన్ని రోబోలు మరికొన్ని ప్రదేశాల్లో అమలు చేస్తామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. స్కౌట్‌గా పిలిచే ఈ రోబో చుట్టుపక్కల పాదచారులతో పాటు పెంపుడు జంతువులు, స్పీడ్ బ్రేకర్లు, అడ్డంగా ఉన్న వస్తువులను గమనిస్తూ ముందుకు సాగే విధంగా అభివృద్ధి చేస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు పేర్కొన్నారు.