బర్మింగ్‌హమ్: ఐసిసి ప్రపంచ కప్ సమరంలో టీమిండియా ఆడే ఆటే క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కెరీర్‌లో చివరి ఆట కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత వరల్డ్ కప్ సమరం తర్వాత ధోని రిటైర్‌మెంట్ ప్రకటించనున్నారనే టాక్ వినిపిస్తుండటమే అందుకు కారణం. బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. వరల్డ్ కప్ టోర్నమెంట్ తర్వాత ధోని క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు తక్కువేనని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదని ప్రకటించడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో, క్రికెట్ ప్రియుల్లో చర్చనియాంశమైంది. మూడు ఫార్మాట్ల నుంచి కెప్టేన్‌గా తప్పుకోవాలని అప్పట్లో అకస్మాత్తుగా ప్రకటించిన ధోని ఇప్పుడు అకస్మాత్తుగా మరో ప్రకటన చేయడనే గ్యారంటీ ఏమీ లేదని క్రికెట్ వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి.
రిటైర్‌మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు
క్రికెట్‌లోకి వచ్చీరావడంతోనే స్టేడియం నలుమూలలా ధనాధన్ షాట్స్ బాదుతూ ధనాధన్ ధోనిగా పేరు తెచ్చుకున్న ధోని అంటే ఇష్టపడని వారు లేరు. క్రికెట్‌లో అజాతశత్రువుగా పేరున్న బ్యాట్స్‌మన్ ధోని. కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచం నలమూలలా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ధోని ప్రస్తుత వరల్డ్ కప్ టోర్నమెంట్ లో మాత్రం కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. ప్రస్తుత టోర్నీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన ధోనీ.. అందులో 223 పరుగులు మాత్రమే చేయడం ఆయనను తీవ్ర విమర్శల్లోకి నెట్టింది. అదీ కాక స్లో బ్యాటింగ్ స్టైల్ సైతం ఇంకొన్ని విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలోనే ధోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటాడా అనే టాక్ బలంగా వినిపిస్తోంది.