బరేలి: పెద్దలకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారనే ఆగ్రహంతో ఓ నూతన జంటపై ఆ యువతి కుటుంబసభ్యులు దాడి చేసిన ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బరేలిలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిన ఓ యువతి తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకుని గ్రామాన్ని విడిచివెళ్లిపోయింది. తాజాగా గ్రామానికి తిరిగొచ్చిన సదరు జంటపై ఆమె కుటుంబసభ్యులు విరుచుకుపడ్డారు. కూతురితోపాటు ఆమె భర్తపై దాడికి పాల్పడిన ఆమె కుటుంబసభ్యులు.. ఆ యువకుడి నుంచి ఆమెను వేరుచేస్తూ కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
ఈ ఘటనపై స్పందించిన రూరల్ ఎస్పీ సన్సర్ సింగ్.. నూతన జంటను వారి బారి నుంచి రక్షించామని తెలిపారు. జంటపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు.