నల్గొండ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొద్దిమంది ఎమ్మెల్యేల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ధిక్కరించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఒకానొక సందర్భంలో పార్టీని వీడి బీజేపిలో చేరేందుకు సిద్ధమయ్యారా అనే ప్రచారం కూడా జరిగింది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా పార్టీ మార్పు అంశంపై మరోమారు స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీకి తాను వ్యతిరేకం కాదని.. పార్టీలో నెలకొన్న వాస్తవ పరిస్థితిపైనే తాను మాట్లాడానని అన్నారు. అందుకే అధిష్ఠానం తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో కార్యకర్తల కష్టనష్టాలను పట్టించుకునే వారే లేరని మరోసారి విమర్శించిన ఆయన.. కుంతియా, ఉత్తమ్ల సారథ్యంలో పార్టీ కోలుకునే పరిస్థితి రాష్ట్రంలో లేనే లేదని స్పష్టంచేశారు.
ఓవైపు పార్టీ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోదని ఆశాభావం వ్యక్తంచేస్తూనే మరోవైపు పార్టీ నేతలపై అదేస్థాయిలో తీవ్ర విమర్శలు గుప్పించడం చర్చనియాంశమైంది.