బెంగళూరు: కొన్ని సందర్భాల్లో మనిషి పడే ఆవేదనను అర్థం చేసుకోవడానికి మాటలే అవసరం లేదు. అలాగే పీకల్లోతు ఆవేదనతో ఉన్న మనిషిని ఓదార్చడానికి కూడా మాటలతో పనే లేదు. చంద్రయాన్-2 విక్రమ్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగడానికి 2.1 కిమీ ముందుగా ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన అనంతరం ఈ ప్రయోగానికి అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తల బృందం తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాన్ని ఓ మహా యజ్ఞంలా ముందు నుంచీ ముందుండి నడిపించిన ఇస్రో చీఫ్ డా కె శివన్ మరింత తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
చంద్రయాన్ 2 చంద్రుడిపై దిగే క్షణాలను ఇస్రో శాస్త్రవేత్తల బృందంతో కలిసి పర్యవేక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి స్వయంగా వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని డా కె శివన్ పడుతున్న మానసిక వేధన కూడా అంతే తీవ్రంగా కలిచివేసింది. దీంతో డా కె శివన్‌ని దగ్గరకు తీసుకుని ఆలింగనం చేసుకున్న ప్రధాని మోదీ... ఆయన వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. ఒక ప్రయోగం విజయం సాధించనంత మాత్రాన్నే డీలాపడి వెనుకడుగేయాల్సిన అవసరం లేదని మౌనంగానే డా శివన్ వెన్ను తట్టి ప్రోత్సహించారు. గుండెలకు హత్తుకుపోయే ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా నెటిజెన్స్ నుంచి లభించిన మద్దతుతో డా శివన్‌కి నిర్భయంగా మరో ప్రయోగం చేసేలా వేయి ఏనుగుల బలాన్నిచ్చింది.