హైదరాబాద్: ప్రపంచస్థాయి ప్రమాణాలతో రైల్వే ప్రయాణికులకు అత్యున్నతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో దేశంలో వంద ప్రైవేటు రైళ్లను నడిపేందుకు రైల్వేబోర్డు సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ ఐదు ప్రైవేట్ రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఐదు రైళ్లలో మూడు ప్రైవేట్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి విజయవాడ, తిరుపతి మార్గాల మధ్య సేవలు అందించనున్నాయి.
రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ మార్గాల మధ్య సేవలు అందించనున్న ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఓ సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మీదుగా వెళ్లే ఈ ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లను ఎంపిక చేసే పనిలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు బిజీ అయ్యారని తెలుస్తోంది.