హైదరాబాద్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవ రావు ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మిక సంఘాలకు మధ్యవర్తిత్వం చేస్తే తమకు ఏ అభ్యంతరం లేదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంతో కృషిచేసిన కేకే అంటే తమకు గౌరవం ఉందని చెబుతూ.. ఆయన మధ్యవర్తిత్వం చేస్తే మంచిదేనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులను గుర్తిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఆ మాటకు కట్టుబడి ఉండాలన్నారు. కేకే చర్చలకు ఆహ్వానిస్తే తాము రావడానికి సిద్ధమేనని అశ్వద్ధామ రెడ్డి స్పష్టంచేశారు.
ఆర్టీసి సమ్మెపై కొందరు మంత్రులు స్పందిస్తున్న తీరును ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుపట్టిన అశ్వద్ధామ రెడ్డి.. వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీ నేతలు ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీఎన్జీవో నేతలకు ఆర్టీసీ సమ్మె గురించి చెప్పలేదనడం సరికాదన్న ఆయన... ఉద్యోగ సంఘాల నేతలపై తమకు విశ్వాసం ఉందని ధీమా వ్యక్తంచేశారు. అశ్వద్ధామ రెడ్డి చేసిన ఈ ప్రకటనతో ఆర్టీసి జేఏసి చర్చల విషయంలో కొంత మెత్తపడినట్టే కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేకే వ్యాఖ్యలపై అశ్వత్థామ రెడ్డి స్పందన