ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేనకు బీజేపి షాక్ ఇచ్చింది. 50-50 ఫార్ములాతో చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌ను తోసిపుచ్చుతూ దేవేంద్ర ఫడ్నవిస్ శివసేనకు తన మనసులో మాటేంటో ఘాటుగానే చెప్పేశారు. మహారాష్ట్రలో త్వరలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఫడ్నవీస్.. ప్రతిభ ఆధారంగానే పదవుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపికి అనుకూలంగానే ప్రజా తీర్పు వచ్చనందున.. అందుకు అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన దేవేంద్ర ఫడ్నవీస్.. శివసేన 'సామ్నా' సంపాదకీయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 50-50 ఫార్ములాపై చర్చ లేదని, కేవలం ప్రతిభ ఆధారంగానే పదవుల కేటాయింపులు ఉంటాయని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి వంటి కీలక పదవిని కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలనే అంశంపై చర్చకు సైతం తావు లేదని ఫడ్నవీస్ స్పష్టంచేశారు.