పోటీపరీక్షల పేరుతో తీసుకొనే కోచింగ్ వల్ల విద్యార్థులు మానసికంగా క్రుంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు ఈ మధ్యకాలంలో అన్ని వార్తపత్రికలు, టీవీ ఛానల్స్‌లో హల్ చల్ చేస్తున్నాయి. గత రెండు నెలల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే సమస్యతో దాదాపు 60 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్వేలు తెలిపాయి. అయితే తప్పు ఎక్కడ జరుగుతుంది? అసలు ఇంత మానసిక ఒత్తిడికి విద్యార్థులు ఎందుకు గురి అవుతున్నారు? అన్న విషయాలు మాత్రం ఎప్పటికీ ప్రశ్నార్థకమే.
జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు. మనిషనేవాడు ఆనందంతో పాటు విషాదాన్ని కూడా చవిచూడాల్సిందే. అయితే అంతమాత్రం దానికే ఆత్మహత్య చేసుకుంటే జీవితానికి పరమార్థమేముంది? కాకపోతే.. అదే విషయాన్ని విద్యార్థులకు తెలియజేయడంలో ఇటు తల్లిదండ్రులు.. అటు ఉపాధ్యాయులు కూడా ఫెయిల్ అవుతున్నారని అంటున్నారు కొందరు మానసిక నిపుణులు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులలో ఆత్మనూన్యత భావం కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి విద్యాలయ పరిస్థితులు తమకు అనువుగా ఉండకపోవడం.. రెండవది క్రమశిక్షణ పేరుతో విధించే శిక్షలు. అయితే.. అన్ని పాఠశాలల్లోనూ అదే పరిస్థితి ఉందని చెప్పలేం. కాకపోతే, ఎక్కువ శాతం పాఠశాలల్లో లేదా విద్యాలయాల్లో ఆ పరిస్థితి కనిపించడం గమనార్హం. తోటి విద్యార్థుల ముందు చిన్నబుచ్చడం, తక్కువ చేసి మాట్లాడడం, శిక్షల పేరుతో విపరీతంగా కొట్టడం లాంటి విషయాలు కూడా ఇలాంటి సంఘటనలకు ప్రధాన కారణంగా సైకాలజిస్టులు చెబుతున్నారు.
నేడు ఇదే పద్ధతి, కళాశాలలకు కూడా క్రమంగా పాకింది. ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అధిక శాతం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ర్యాంకు వస్తుందా లేదా అన్న టెన్షన్‌తో పాటు, కళాశాలల్లో పెట్టే నెలవారీ పరీక్షల్లో మార్కులు ఎలా వస్తున్నాయి? లాంటి విషయాలలో తమను తాము సమీక్షించుకోలేకపోతున్నారు. సబ్జెక్టు అర్థమైనా, కాకపోయినా.. సందేహాలను స్నేహపూర్వకంగా ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకొనే సంప్రదాయం నేడు చాలా తక్కువచోట్లే కనిపిస్తుంది. దీనికి భయమే ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది.
అలాగే నేడు పాఠశాలలు, కళాశాలలు బాలల హక్కుల విషయంలో కూడా నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నాయన్నది మరో వాదన. ఇళ్ళల్లో కనిపించే కనీస పరిశుభ్రత కూడా కొన్ని విద్యాలయాల్లో కనిపించడం లేదు. వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నా.. కనీస పరిశుభ్రతను కూడా పాటించని 146 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నోటీసులిచ్చింది. కేవలం చదువొకటే పరమావధి కాదని.. విద్యార్థి జీవితంలో క్రీడలకు, కళలకు కూడా చోటివ్వాలని, యోగా తరగతులు కూడా నిర్వహించాలని.. 2017 మే నెలలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని విషయాలు విద్యాలయాలు ఎంతవరకు పాటిస్తున్నాయన్న విషయం మాత్రం ఆ దేవుడికే ఎరుక.
మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులకూ తప్పని ఒత్తిడి
పాఠశాలలు, కళాశాల విద్యార్థుల సంగతి ఇలా ఉంటే.. మెడికల్, ఇంజినీరింగ్ లాంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తీరు కూడా కొంతలో కొంత ఇదే స్థాయి ఒత్తిళ్లతో సాగడం గమనార్హం. ముఖ్యంగా ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో ప్రాజెక్టు వర్క్, సెమినార్లు, ప్రాంగణాల నియామకాల పేరుతో కొందరు విద్యార్థులు పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. అయితే, చదువుతున్న చదువును వారు ఎంజాయ్ చేయలేకపోవడమే అందుకు ప్రధాన కారణమంటున్నారు మానసిక నిపుణులు.
ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే.. ఏ స్థాయి విద్యార్థులకైనా తమ చదువులపై ఆసక్తి కలగడం అనేది ముఖ్యం. అదే ఆసక్తి పోతే వారు చెడు మార్గాలు పట్టే అవకాశం ఉంది. కొందరు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంటే. మరికొందరు తమ స్నేహపరిధిని పెంచుకొనేందుకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా గడుపుతున్నారు. అలా వారి జీవనశైలి కూడా మారిపోతోంది. ఆ తర్వాత సమయాన్ని ఉపయోగించుకోకుండా, పరీక్షలు ఇంకా రెండు, మూడు నెలల్లో వస్తున్నాయి అనగా.. పుస్తకాలు తీస్తున్నారు. ఇవన్నీ కూడా ఒత్తిడిని పెంచే విషయాలే. అయితే ఈ సమస్య తగ్గాలంటే.. ప్రతీ కళాశాలల్లో విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పెంచే కౌన్సిలింగ్ సెల్స్ కూడా ఉండాలని కోరుతున్నాయి మానవ హక్కుల సంఘాలు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా విద్యార్థు్లలో ప్రేరణను కలిగించే మాటలే మాట్లాడాలి.. అంతే కానీ వారిలో ప్రతికూల ఆలోచనలు పెంచే మాటలకి స్వస్తి చెప్పాలి. అప్పుడే మనం అనుకున్నంత మేరకైనా విద్యార్థుల చావులు తగ్గుముఖం పట్టగలవు.
ఈ ఆత్మహత్యల పర్వానికి కారణమెవరు?