ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం (జనవరి 21) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను రూ.3.4 కోట్లుగా వెల్లడించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ మొత్తం ఆస్తులు 2015లో రూ.2.1 కోట్లు కాగా, గత ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ.1.3 కోట్లు పెరిగాయి. కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
Also Read: 10 హామీలతో కార్డు విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్
ఎన్నికల అఫిడవిట్‌లో అరవింద్ కేజ్రీవాల్ తన పేరు మీద ఉన్న ఆస్తులతో పాటు భార్య సునీతా కేజ్రీవాల్ పేరిట ఉన్న మొత్తం ఆస్తులను వెల్లడించారు. సునితా కేజ్రీవాల్ పేరిట ఉన్న నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ రూ.57లక్షలు. కాగా, 2015 నాటికి వీటి విలువ రూ.15లక్షలు. గడిచిన ఐదేళ్లలో కేజ్రీవాల్ సతీమణి సునిత పేరిట ఉన్న ఆస్తులు రూ.32లక్షల మేర పెరిగాయి. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయగా వచ్చిన నగదు, ఇతర సేవింగ్స్ నగదు కలిసి రూ.32లక్షల విలువ అని అఫిడవిట్‌లో కేజ్రీవాల్ తెలిపారు.
కేజ్రీవాల్ వద్ద ఉన్న నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల విలువ ఐదేళ్ల కిందట రూ.2.2లక్షలు కాగా, నేడు ఆ ఆస్తుల విలువ రూ.9.6 లక్షలుగా ఉంది. స్థిరాస్థుల విలువ రూ.92 లక్షల నుంచి రూ.1.7కోట్లకు పెరిగింది. కేజ్రీవాల్ సతీమణి సునిత పేరిట ఉన్న స్థిరాస్థుల విలువలో ఏ మార్పులేదు. కాగా, కేజ్రీవాల్‌కు గతంలో ఉన్న స్థిరాస్తుల విలువ పెరిగింది తప్ప ఆయన ఏ ఆస్తులు కొనుగోలు చేయలేదని ఆప్ నేతలు చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 8న ఎన్నికలు, 11న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
Also Read: 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ