Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారనే దానిపై ఇంకా సస్పెన్స్..కంటిన్యూ అవుతోంది. సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేసినా... కొత్త సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఫడ్నవీస్, షిండే ఎవరు వెనక్కి తగ్గకపోవటంతో.. సీఎం పదవిపై డైలమా కొనసాగుతోంది. అయితే వరుస భేటీల తర్వాత ఇవాళ కుర్చిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే నిన్న రాజీనామా చేశారు. రాజ్యంగ పరంగా కొత్త అసెంబ్లీ కొలువైన తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేయడం ఆనవాయితీ. ఇక డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తో కలిసి రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు రిజైన్ లెటర్ అందజేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఏక్ నాథ్ షిండేను గవర్నర్ కోరారు. మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో సీఎం పదవికి షిండే రాజీనామా చేశారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎవరో ఇంకా తేల్చకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించగా, సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. కూటమిలోని బీజేపీకి 132, షిండే శివసేనకు 57, అజిత్ పవర్ ఎన్సీపీకి 41 సీట్లు సాధించగా.. సీఎం పోస్టు కోసం బీజేపీ, శివసేన మధ్య పోటీ నెలకొంది. మొత్తంగా మహారాష్ట్రలో మహాయుతికి మొత్తంగా 231 సీట్లను కైవసం చేసుకుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చి నాలుగు రోజులైనా సీఎం ఎవరనేది ఇంకా తేలలేదు. అటు బీజేపీ, ఇటు శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం సిగపట్లు పట్టుకుంటున్నారు. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇవ్వాలని బీజేపీ నేతలు, మళ్లీ ఏక్ నాథ్ షిండేకే ఇవ్వాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం పదవి విషయంలో బిహార్ మోడల్ ను అనుసరించాలని శివసేన నేతలు కోరుతున్నారు. అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, కూటమిలో భాగంగా నితీశ్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతనే సీఎం చేయాలని ఆ పార్టీ హైకమాండ్, ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఫడ్నవీస్ కోసం ఆర్ఎస్ఎస్ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరోవైపు తమ నేతనే సీఎం అవుతారంటూ రెండు పార్టీల లీడర్లు ధీమాగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఫడ్నవీస్ నే సీఎం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నదని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే తెలిపారు. సీఎం ఎంపికపై హైకమాండ్ తొందరపడడం లేదన్నారు. కూటమిలో చీలిక రాకుండా జాగ్రత్త పడుతున్నదని బీజేపీ నేత ఒకరు చెప్పారు. కాగా, సీఎం ఎవరనేది వివాద రహితంగా పరిష్కారం అవుతుందన్నారు. కూటమిలో చర్చించి ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ వర్గాలు తెలిపాయి.
మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే 2019 సీన్ రిపీట్ అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా....బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకుంది. అయితే సీఎం పోస్టు విషయంలో భేదాభిప్రాయాలు రావడంతో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే కూటమి నుంచి బయటకొచ్చి..తమ సిద్దాంతాలకు విరుద్ధమైన ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ శివసేన లీడర్ ఏక్ నాథ్ షిండే రెబెల్ గా మారి పార్టీని చీల్చడంతో ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఆయన బీజేపీతో కలిసి మహారాష్ట్రలో సర్కార్ ఏర్పాటు చేశారు. అయితే తన మాజీ బాస్ ఉద్ధవ్ థాక్రే పరిస్థితే ఇప్పుడు షిండేకు ఎదురైంది. సీఎం పోస్టు విషయంలో బీజేపీ, శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కానీ ఉద్ధవ్ లాగా షిండే బయటకు వచ్చినా బీజేపీకి నష్టమేమీ లేదు. బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
ఇదిలా ఉంటే ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం కుదరగకపోతే... ముగ్గురికి సీఎం పదవి వరించేలా డీల్ ఓకే చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా రెండు సంవత్సరాలు సీఎంగా ఫడ్నవీస్... మరో రెండు సంవత్సరాలు షిండే... ఇక లాస్ట్ ఇయర్ అజిత్ పవర్ ను సీఎంగా చేయాలని చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ షిండే ఈ డీల్ కు ఒప్పుకోకుంటే బీజేపీ..అజిత్ పవర్ తో కలిసి సీఎం పదవి చేపట్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొదటి మూడు సంవత్సరాలు... సీఎంగా ఫడ్నవీస్... ఆ తర్వాత రెండు ఏళ్లు అజిత్ పవర్ సీఎం అయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter