ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎండ పెరుగుతున్న కొద్దీ . . పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూ కూడా పెరగడం విశేషం.
మరోవైపు రాజకీయ ప్రముఖులు, అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. భారతదేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఢిల్లీలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సవితా కోవింద్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం .. రాష్ట్రపతి కార్యాలయం సమీపంలోనే ఉంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఔరంగజేబ్ రోడ్ లోని పోలింగ్ బూత్ 81లో ఆయన ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. రాహుల్ గాంధీ రావడంతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. రాహుల్ రాక సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిద్దరూ నిర్మాణ్ భవన్లోని పోలింగ్ బూత్ నంబర్ 114, 116లలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.
అటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. నిర్మాణ్ భవన్ లో మన్మోహన్ దంపతులు ఓటు వేశారు.
మరోవైపు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తుగ్లక్ రోడ్లోని NDMC స్కూలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి జై శంకర్ అన్నారు. ఓటు వేయడం.. అందరూ కనీస బాద్యతగా గుర్తించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకుని దేశ సమగ్రాభివృద్ధిలో పౌరులు తోడ్పాటు అందించాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం బయట ఈసీ సిబ్బంది ఏర్పాటు చేసిన 'ఐ ఓట్ ఫర్ నేషన్' అనే ఫ్లెక్సీ మధ్యలో నిలబడి ఆయన ఫోటో దిగారు.