కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయంలో బయో డైవర్సిటీ పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి రామనాథ్ రాయ్ పై ఊహించని రీతిలో తేనెటీగలు దాడి చేశాయి. డ్రోన్ కెమెరా తేనెపట్టుకి తగలడం వల్ల.. అప్పటివరకు చెట్ల చాటున ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా బయటకు వచ్చి విద్యార్థులతో పాటు అక్కడ ఉన్న చాలామందిపై దాడి చేశాయి. ఆ సంఘటన జరిగినప్పుడు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ అంగడీ కూడా అక్కడే ఉన్నారు.
పార్కు ప్రారంభోత్సవం తర్వాత గాలిలో బూరలు ఎగరేసిన అతిథులను ఫోటో తీయడానికి ఓ ప్రైవేటు కెమెరామన్ డ్రోన్‌ను ఉపయెగించినప్పుడు, అనుకోకుండా అది చెట్ల మధ్యనున్న తేనెపట్టుకి గట్టిగా తగలడం వల్ల, తేనెటీగలు బయటకు వచ్చి విజృంభించాయి. అయితే మంత్రిని కేవలం ఒక తేనెటీగ మాత్రమే కరిచిందని.. అంతలోపే అతన్ని సురక్షితంగా అక్కడి నుండి తరలించారని చెబుతున్నారు అధికారులు. అదే సమయంలో అక్కడున్న బెలగావీ రేంజ్ అటవీ శాఖ అధికారులు కె ఎస్ హిరమత్, శ్రీనాథ్ కడోల్కర్లు గాయాల బారిన పడగా, వారిని హుటాహుటిన దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారని సమాచారం.
విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయంలో బయో డైవర్సిటీ పార్కు 300 ఎకరాలు ఉన్న అటవీ ప్రాంతంలో 60 ఎకరాలు పరిధి మేరకు అభివృద్ధి చేయబడింది. దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్కును నిర్మించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన కొంత డబ్బుతో ఈ పార్కు రూపుదిద్దుకుంది. "సాలు మరద తిమ్మక్క పార్కు" అని ఇటీవలే ఈ పార్కుకి నామకరణం కూడా చేసింది ప్రభుత్వం.