'కరోనా వైరస్'.. వేగంగా విస్తరిస్తోంది. లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నప్పటికీ ... ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు లాక్ డౌన్ 2.0 కారణంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతోంది. కాబట్టి.. కేంద్రం ఏప్రిల్ 20 నుంచి పాక్షిక ఆంక్షలతో కొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ లాక్ డౌన్ అమలు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల జాబితాను కూడా విడుదల చేసింది. ఐతే కేంద్రం పంపిన మార్గదర్శకాల కంటే మరింత ముందుకెళ్లింది కేరళ ప్రభుత్వం.
కేరళలో పలు ప్రాంతాల్లో హోటళ్లు,రెస్టారెంట్లు పునః ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతే కాదు కొద్ది దూరాలకు బస్సులను కూడా ప్రారంభించింది. అటు ప్రయివేట్ వాహనాలకు సరి, బేసి విధానంతో అనుమతులు ఇచ్చారు. దీనిపై కేంద్ర హోం శాఖ మండిపడింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను కేరళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించింది. లాక్ డౌన్ మార్గదర్శకాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేరళ ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాసింది. ఏప్రిల్ 15న విడుదల చేసిన మార్గదర్శకాల జాబితాను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించింది. అందుకు విరుద్ధంగా వర్క్ షాపులు, సెలూన్లు, రెస్టారెంట్లు, పుస్తకాల దుకాణాలు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు పునః ప్రారంభించుకునేందుకు అనుమతి ఎందుకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండోసారి విడుదల చేసిన మార్గదర్శకాల జాబితాను ఉల్లంఘించడం డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 కిందకు వస్తుందని పేర్కొంది.
మరోవైపు కేరళ రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా పినరయి విజయన్ ప్రభుత్వం విభజించింది. రెడ్, ఆరెంజ్ A, ఆరెంజ్ B, గ్రీన్ జోన్లుగా విభజించారు. ఆ తర్వాత లాక్ డౌన్ కు పాక్షికంగా సడలింపు ఇస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇందులో రెడ్ జోన్లో ఉన్న కసర్గడ్, కన్నూర్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతోంది. ఆరెంజ్ A జోన్లో ఉన్న పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాల్లో పాక్షికంగా సడలింపు ఇచ్చారు. అలాగే ఆరెంజ్ Bలో ఉన్న జిల్లాలు అలెప్పీ, త్రివేంద్రం, పాలక్కడ్, వాయనాడ్, త్రిస్సూర్ జిల్లాల్లోనూ సడలింపు ఇచ్చారు.
కేరళలో ఇప్పటి వరకు 401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐతే లాక్ డౌన్ 2.0 పొడగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటిస్తున్నప్పుడే ఓ అంశాన్ని గుర్తు చేశారు. ఏప్రిల్ 20 నుంచి నాన్ కంటైన్ మెంట్ జోన్లలో సడలింపు ఇవ్వవచ్చని ప్రకటించారు. ఇప్పుడు కేరళ ప్రభుత్వం అదే అనుసరించినట్లు తెలుస్తోంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
కేరళ సర్కారుపై కేంద్రం సీరియస్..!!