జనసేన పార్టీ విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ..ఇప్పుడు విమర్శల దాడి మొదలెట్టింది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పవన్ కల్యాణ్ చీల్చుతాడని..ఆయనతో పొంచి ఉన్న ముప్పును ముందే గ్రహించిన వైసీపీ తన మందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే చందంగా ఇప్పుడిప్పుడే ప్రజా క్షేత్రంలో అడుగుపెడుతున్న పవన్ పై ఎదురు దాడి ప్రారంభించింది. ఇందుకు వైసీపీ ఎమ్మెల్యే రోజా శంఖారావం పూరించారు.
అన్నను మోసం చేసిన మొనగాడు పవన్..
చిరంజీవిని మోసం చేసిన వారిలో ముందు వరసలో పవన్ కల్యాణే ఉంటారని రోజా ఆరోపించారు. అన్న చిరంజీవిగారిని మోసం చేసిన వారిని వదిలిపెట్టను అని చెప్పిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రోజా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అన్న చిరంజీవిగారిని మోసం చేసిన వారిని వదిలిపెట్టనని పవన్ అంటున్నారు. అన్న ముఖ్యమంత్రి అవుతాడని భావించిన పవన్ పరుగెత్తుకు వచ్చి యువనేతగా ప్రచారం చేశారు. తీరా ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు మాత్రమే గెలుచుకోవడంతో చిరంజీవిని వదిలేసి ..పవన్ తన పాటికి తాను షూటింగ్‌లకు వెళ్లి అన్నకు అన్యాయం చేశారని... ముందు పవన్ తనకు తాను శిక్షించుకోవాలని రోజా కౌంటర్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్ టీడీపీ ఏజెంట్
చిరంజీవికి ద్రోహం చేసిన వాళ్లలో మొదట పవన్ కల్యాణ్ ఉంటే.. తర్వాత లిస్ట్‌లో అల్లు అరవింద్, చంద్రబాబు ఉన్నారని... వీళ్లందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఇంటికి పంపించాని రోజా విమర్శించారు. ఈ రోజు చిరంజీవిని ఎవరో నాశనం చేశారని.. వాళ్లను వదిలిపెట్టను అంటూ పవన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉందని రోజా ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ..చంద్రబాబు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటే అప్పుడు ప్రత్యక్షమై గుడ్డిగా సమర్థించి వెళ్లిపోతాడని పవన్ పై రోజా విమర్శల వర్షం కురిపించారు.
జనసేనపై వైపీసీ ఎదురు దాడి వైఖరితో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. వైసీపీ సరికొత్త స్టాండ్‌తో మన పాలిటిక్స్ ఆసక్తికరంగాను.. ఉత్కంఠభరితంగానూ మారాయి.