నోబెల్ పురస్కారం ఈ యేడు రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం జారీ చేసిన ప్రకటన ప్రకారం లైఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్‌కు సంబంధించిన త్రీడీ చిత్రాల తయారీల గురించి పరిశోధనలు జరిపినందుకు గాను వీరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన జాక్స్ దుబోచెట్, జోచిమ్ ఫ్రాంక్(యూఎస్‌ఏ), రిచర్డ్ హెండర్సన్(యూకే)లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. క్రియో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అనే టెక్నిక్ అభివృద్ధికి దోహదపడేవిధంగా పరిశోధన చేసినందుకు ఈ శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. ఈ పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించిన రిచర్డ్ హెండర్సన్ ఒక స్కాటిష్ సైంటిస్టు. ఎంఆర్‌సీ లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో విధులు నిర్వహిస్తున్న హెండర్సన్ ప్రొటీన్‌కి సంబంధించిన డైమెన్షనల్ చిత్రం రూపొందే విషయంలో ప్రయోగాలు చేశారు. ఇదే అవార్డు పొందిన మరో సైంటిస్టు జోచిమ్ ఫ్రాంక్, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. పరిశోధనకు సంబంధించి సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. అలాగే జాక్స్ దుబోచెట్ లాసేన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. బయో మాలిక్యుల్స్ పరిమాణ మార్పులకు సంబంధించి విట్రిఫికేషన్ టెక్నిక్‌ను మరింత అభివృద్ధి చేసినందుకు ఆయనను కూడా అవార్డు గ్రహీతగా ప్రకటించారు. ఈ అవార్డు క్రింద శాస్త్రవేత్తలకు 825,000 పౌండ్లు బహుమతిగా ఇవ్వడం గమనార్హం.