జమ్ముకశ్మీర్ ( Jammu kashmir ) లో మళ్లీ వివాదం రేగుతోంది. త్రివర్ణ పతాకంపై మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ( Ex cm Mehbooba Mufti ) వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యంతరం తెలిపాయి.
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 ( Article 370 ) తొలగింపు నుంచి నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇటీవలే అంటే 14 నెలల అనంతరం బయటికొచ్చారు. నిర్బంధం నుంచి బయటికొచ్చినప్పటి నుంచి ఆర్టికల్ 370 విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. తాజాగా త్రివర్ణ పతాకంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కశ్మీర్లో ప్రత్యేక జెండా ఎగురవేసేందుకు అనుమతి లభించేవరకూ భారతదేశ త్రివర్ణ పతాకం ( Indian Flag ) ఎగురవేయనంటూ మెహబూబూ ముఫ్తీ వివాదాస్పదవ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యంతరం తెలిపాయి. ఆర్టికల్ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూకశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామని..మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. అప్పటి వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయనన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ( BJP ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు.
ఈ భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం గానీ జమ్ముకశ్మీర్ ప్రత్యేక జెండాను ( Jammu kashmir special flag ) ఎగురవేయడం గానీ చేయలేవని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. భారతదేశ జెండా, దేశం, మాతృభూమి కోసం ఎందరో రక్తం చిందించారని.. జమ్ము కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగమని చెప్పారు. దేశంలో ఎగిరేది ఒకే ఒక్క జెండా అని..అది త్రివర్ణ పతాకం మాత్రమేనని అన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ముఫ్తీ.. కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఏదైనా జరిగితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. శాంతి, సాధారణ స్థితి, సోదరభావానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందన్నారు. అదే విధంగా కశ్మీరీ నాయకులు భారతదేశాన్ని సురక్షితం కాదని భావిస్తే.. పాకిస్తాన్ లేదా చైనాకు వెళ్లిపోవచ్చన్నారు.
మరోవైపు మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని.. త్రివర్ణ పతాకమనేది భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని పార్టీ స్పష్టం చేసింది. Also read: Pakistani quadcopter: పాక్ ప్రయోగించిన చైనా క్వాడ్క్యాప్టర్ని కూల్చేసిన ఇండియన్ ఆర్మీ