అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రముఖ భారతీయ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై ఢిల్లీ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శుక్రవారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో మరో ప్రముఖ రెజ్లర్ ప్రవీణ్ రానాతోపాటు అతడి అనుచరులపై దాడికి పాల్పడ్డారనే అభియోగాల కింద సుశీల్ కుమార్‌తోపాటు అతడి అనుచరులపై సైతం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా హానీ కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 323, నిగ్రహం కోల్పోయి దాడికి పాల్పడినందుకు సెక్షన్ 341 కింద కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
రెండుసార్లు ఒలంపిక్ మెడల్ గెల్చుకున్న సుశీల్ కుమార్ వచ్చే ఏడాది జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. అయితే, తనతోపాటు తన సోదరుడిపై సుశీల్ కుమార్, అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారని ప్రవీణ్ రానా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో సుశీల్ పేరు మరోసారి క్రైమ్ న్యూస్‌లోకి ఎక్కింది.
శుక్రవారం జరిగిన ఘటనపై ట్విటర్ ద్వారా స్పందించిన సుశీల్ కుమార్.. అది ఒక దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. ''ఈ వివాదంలో తాను ఎవ్వరినీ సమర్ధించదల్చుకోలేదు. ఎవరో కొందరు వ్యక్తులపై కాకుండా దేశం కోసం పోరాడి దేశానికి పతకం సాధించాలన్నదే తన ఆశయం" అని సుశీల్ తన ట్వీట్‌లో స్పష్టంచేశారు.
It’s very unfortunate and highly condemnable what has happened today at the stadium. I do not support anyone who gets violence in between sportsmanship. My aim is to fight & win for my Nation like a true sportsman & not to win against any group or individual #JaiHind 🇮🇳
— Sushil Kumar (@WrestlerSushil) December 29, 2017