భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ కౌన్సిల్ సమావేశాలు జనవరి 8 నుండి 10 వరకు విజయవాడలో జరగనున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. జాతీయస్థాయి నాయకులందరూ పాల్గొని రాజకీయ ముసాయిదా సిద్ధం చేస్తారన్నారు.
"నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గత మూడు సంవత్సరాలలో అనేక విషయాలు జరిగాయి. జీఎస్టీ, నోట్లరద్దు, హిందూమత సిద్ధాంతాలు హెచ్చుమీరడం.. దేశాన్ని అనిశ్చితిలోకి నెట్టేశాయి. మోదీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. త్వరలో విభజన హామీలపై ప్రత్యక్ష ఆందోళనలకు సిద్దమవుతాం. విజయవాడ సమావేశంలో రాజకీయ సమీక్షలు, సంస్థాగత సమీక్షలు చర్చకు వస్తాయ"ని ఆయన చెప్పారు. దేశం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించి తీర్మాన పత్రాలను అన్ని రాష్ట్రాలకు పంపనున్నామన్నారు.
ఏప్రిల్ 24, 25 తేదీల్లో కేరళలోని కొల్లంలో జాతీయ సమావేశం జరుగనున్నదని, విజయవాడ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అజెండాను ఆమోదించనున్నట్లు రామకృష్ణ చెప్పారు.