అంతర్జాతీయ వేదికపై మరో తెలుగు క్రీడా తార మెరిసింది. హైదరాబాదీ క్రీడాకారిణి సామియా ఇమాద్ ఫారూఖి ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ అండర్-15 విజేతగా నిలిచింది. మయన్మార్ లోని యాంగాన్ లో అండర్-15 బాలికల విభాగం సింగిల్స్ లో 14 ఏళ్ల సామియా 15-21, 21-17, 21-19 తేడాతో ఇండోనేషియా క్రీడాకారిణి విడ్జజా స్టెఫానీపై విజయం సాధించి బంగారు పతకం గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చి త్రివర్ణ జెండాను రెపరెపలాడించింది. పీవీ సింధు తర్వాత ఈ ఘనత సాధించిన భారత రెండో షట్లర్‌గా ఘనత దక్కించుకుంది.
నేపథ్యం : సామియా ఇమాద్ ఫారూఖి ప్రస్తుతం 8వ తరగతి చదువుతోంది. గచ్చిబౌలీలోని సాయి గోపీచంద్ నేషనల్ బాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. జాతీయ సీనియర్, సబ్ జూనియర్ టోర్నీల్లో పాల్లొని పలు మెడల్స్ సాధించింది. ఆసియా బ్యాడ్మిటన్ లో గతేడాది సామియా అండర్ 15 డబుల్స్ లో కాంస్యం సాధించింది. విజయం స్పందిస్తూ ..కోచ్ స్పూర్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించానని సామియా తెలిపింది.