కర్ణాటకలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్య పోటీ బీజేపీ-కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. అయితే ఈ ఎన్నికలు దేవుళ్లవద్ద వరకు వెళ్లాయి. దేవుళ్లపై కూడా వ్యాఖ్యలు చేసి రాజకీయాలను మరింత దిగజారుస్తున్నారని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పరివర్తన్ ర్యాలీలో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ఈ ఎన్నికలు అల్లాహ్ కు రాముడికి మధ్య యుద్ధం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు కర్ణాటక మంత్రి రామనాథ రాయ్ "నేను అల్లాహ్ కృప వల్లనే ఆరుసార్లు గెలిచాను" అని అన్నారు.
వివరాల్లోకి వెళితే దక్షిణ కన్నడ జిల్లా బంత్వాల్ లో ముస్లిం ఓటర్లు ఎక్కువ. ఆ ప్రాంతం నుండి ఎన్నికైన మంత్రి రామనాథ రాయ్ ఇటీవల నియోజకవర్గ పర్యటనలో "అల్లహ్ దయవల్లనే నేను ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచాను" అని వ్యాఖ్యలు చేశారు. ఇదే ప్రాంతంలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో భాగంగా ప్రచారం చేసింది. "అతను(రామనాథ రాయ్) అల్లా దయవల్ల గెలిచానని చెప్పుకున్నాడు. మనం మన దేవుణ్ణి గెలిపించుకోలేమా..! ఈ ఎన్నికలు కాంగ్రెస్-బీజేపీ మధ్య కాదు.. అల్లాహ్-రాముడి మధ్య యుద్ధం"అని కర్కల బిజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు.