ఆ ఘోర ప్రమాదం.. హృదయవిదారకం

   

Last Updated : Oct 15, 2017, 04:17 PM IST
ఆ ఘోర ప్రమాదం.. హృదయవిదారకం

హర్లీన్ గ్రేవాల్ ఒక ఎన్నారై విద్యార్థిని. అమెరికాలో ఆమె ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. డ్రైవర్ చేసిన తప్పిదం కారణంగా, ఒక ఘోర ప్రమాదంలో ఆమె నిండు ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లడానికి ఓ క్యాబ్ బుక్ చేసుకొంది హర్లీన్. ఆ క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ సయ్యద్ హమీద్ ఒక కాంక్రీట్ గోడను గట్టిగా ఢీకొనడంతో, వెంటనే వాహన ట్యాంకర్ పేలి, అగ్ని చెలరేగుతూ అంతా వ్యాపించింది. సీటుబెల్టు పెట్టుకున్న హర్లీన్ వెంటనే అది రాకపోవడంతో కారులోనే చిక్కుకుపోయింది. తొలుత హమీద్ ఆమెను కాపాడాలని ప్రయత్నించినా, కారు మొత్తం అగ్ని వ్యాపించడంతో పాటు తన చేతులు, కాళ్లకు కూడా గాయాలు కావడంతో వెంటనే బయటకు వచ్చేశాడు. ఇక ఆమెను పట్టించుకోకుండా, వెనుదిరిగి చూడకుండా, వెంటనే పరుగెత్తుతూ రోడ్డు మీదకు వచ్చి వేరే క్యాబ్ బుక్ చేసుకొని ఆసుపత్రికి వెళ్లిపోయాడు. అగ్నిలో చిక్కుకున్న హర్లీన్ కేకలు విని వచ్చిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. వారు వచ్చి చూసేసరికే హర్లీన్ శరీరం పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యిపోయింది. ఆ తర్వాత వాహన నెంబరు ద్వారా డ్రైవర్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని ఆసుపత్రికి వెళ్లి కలిశారు.

ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు మానవతను మరిచి తన ప్రయాణికురాలి మరణానికి కారణం అవ్వడంతో పాటు, పోలీసులకు సమాచారం ఇవ్వలేనందుకు కేసు నమోదు చేశారు. అదే విధంగా లైసెన్సు లేకుండా కారు నడుపుతున్నందుకు, స్పీడ్ డ్రైవింగ్ చేసినందుకు కూడా మరో కేసు నమోదు చేశారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ క్రిమినల్ కోర్టులో ప్రస్తుతం ఈ కేసు నడుస్తోంది. ఫ్లాట్ ల్యాండ్స్ ప్రాంతంలో నివసిస్తున్న హమీద్ కారు స్టార్టు చేయకముందు కాస్త మద్యం కూడా సేవించినట్లు ఎంక్వయిరీలో తేలింది. అయితే అతని సోదరుడు చెబుతున్న వాదన వేరేగా ఉంది. తొలుత ప్రయాణికురాలిని కాపాడడానికే హమీద్ ప్రయత్నించాడని, కాని తన చేతులకు గాయాలు అవ్వడంతో ఆ నొప్పికి భరించలేక వెంటనే అనాలోచితంగా అక్కడ నుండి పరుగెత్తుకుంటూ వెళ్లాడని అన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న హర్లీన్ స్నేహితుడు జరిగిన సంఘటనకు చింతిస్తూ, తన అభిప్రాయాలు చెప్పారు. హర్లీన్ అందరి గురించి ఆలోచించే వ్యక్తని.. ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకొనే గుణం ఆమెదని.. అలాంటి ఆమెకు ఇలాంటి ఘోరం జరగడం బాధాకారమని... ఇది తన గుండెను కలచివేసిన ఘటన అని తెలిపారు. 

Trending News