ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని చుట్టుముట్టిన ఢిల్లీ పోలీసులు

 కేజ్రీవాల్ ఇంటి ఎదుట ఉద్రిక్తకర పరిస్థితులు

Last Updated : Feb 24, 2018, 01:04 AM IST
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని చుట్టుముట్టిన ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టుగా ఎప్పుడూ ఏదో ఓ తలనొప్పి వెంటాడుతూనే వుంది. ముఖ్యమంత్రిగా అత్యల్ప వ్యవధిలో అత్యధిక కేసులు, విచారణలు ఎదుర్కుంటున్న అరవింద్ కేజ్రీవాల్ ని ప్రస్తుతం ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ పై దాడి కేసు వేధిస్తోంది. సోమవారం రాత్రి జరిగిన ఓ సమావేశానికి హాజరైన తనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఎటాక్ చేశారంటూ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఢిల్లీ పోలీసులు నేడు కేజ్రీవాల్ తోపాటు ఆ పార్టీ నేతలని ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ ని ప్రశ్నించడంతోపాటు అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది అని తెలుసుకునేందుకు అక్కడి సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ పోలీసుల సీఎం అరవింద్ కేద్రీవాల్ ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి ఎదుట ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ విషయమై స్పందించిన ఢిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి అరునోదయ ప్రకాష్.. సుమారు 60 నుంచి 70 మంది పోలీసులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వచ్చినట్టు తెలిపారు. ఢిల్లీ పోలీసులు తన ఇంట్లో తనిఖీలు జరపడంపై స్పందించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ పోలీసులు ఈరోజు తన ఇంట్లో తనిఖీలు చేయడంలో చూపించినంత అత్యుత్సాహం హై కోర్టు జడ్జి బీహెచ్ లోయ మృతి అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంట్లోనూ సోదాలు చేయడానికి చూపించి వుంటే దేశం వారిని చూసి గర్వించేది అని అన్నారు. 

 

గుజరాత్‌లో సోహ్రబుద్దిన్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటుండగా ఆ కేసుని విచారిస్తున్న హై కోర్టు జడ్జి 2014 డిసెంబర్‌లో గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

Trending News