శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై సోమవారం అసెంబ్లీలో జరిగిన దాడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తూ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి సస్పెండ్ చేశారు. వీరితో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేశారు. బడ్జెట్ సమావేశాలకు సస్పెండ్ అయిన వారిలో ప్రతిపక్షనేత జానారెడ్డితోపాటు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, డి.మాదవరెడ్డి, వంశీచంద్లు ఉన్నారు. అనంతరం సస్పెండైన సభ్యులు సభను వీడాలని స్పీకర్ కోరారు.
తరువాత, శాసన సభ వ్యవహారాల మంత్రి టీ,హరీష్ రావు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను రద్దు చేయాలని తీర్మానం చేయగా.. సభ్యులు వాయిస్ వోట్ ద్వారా తీర్మానాన్ని ఆమోదించారు.
మంగళవారం సభ సమావేశమైన వెంటనే, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి చూసి షాక్‌కి గురయ్యానన్నారు. నాలుగు సంవత్సరాల తెలంగాణ శాసనసభ చరిత్రలో ఈ ఘటన ఓ మచ్చగా నిలిచిపోతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు సోమవారం జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించారు.