తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటనలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. శనివారం మహదేవ్పూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించిన మంత్రి అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రాజెక్టు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబటిపల్లి గ్రామం సమీపంలోకి చేరుకోగానే మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాధారణంగా ఇది మంత్రి ప్రయాణించే ఇన్నోవా కారు. కాకపోతే ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి ఆ కారులో కాకుండా కాన్వాయ్ లోని మరో కారులో ప్రయాణిస్తున్నారు.
కారు ఇంజన్ వేడెక్కడం వల్లే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాన్వాయ్‌ని పక్కకు ఆపేసి మంటలను ఆర్పేశారు. అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. ఆ కారుని పక్కకు పెట్టిన మంత్రిభద్రతా సిబ్బంది అనంతరం కాన్వాయ్‌తో ముందుకు వెళ్లిపోయినట్టు సమాచారం.