నల్గొండ జిల్లాలోని కొండమల్లెపల్లి మండలం పెండ్లి పాకల గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఊరి చివరన వున్న చెరువులో ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారులు చెరువులో మునిగి మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన చిన్నారులంతా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలుగా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒంటిపూట బడి కావడంతో మధ్యాహ్నమే బడి నుంచి ఇంటికి వచ్చిన చిన్నారులు, సరదాగా ఆడుకోవడానికని చెరువుకి వెళ్లి అందులోనే మునిగి చనిపోయారు. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఓంకార్, హన్మా, సర్ధార్ అనే ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ముళ్లు కాగా వీళ్ల కుమారులే ఈ దుర్ఘటనలో అసువులుబాసారు. మృతి చెందిన చిన్నారుల్లో ఓంకార్ కుమారులైన సంతోశ్(7), రాకేశ్(6).. హన్మా కుమారులైన నవదీప్ (7), సాత్విక్(6).. సర్ధార్ కుమారుడైన శివ (6) ఉన్నారు. మృతి చెందిన చిన్నారులంతా ఏడేళ్లలోపు వారే.
పెండ్లి పాక దుర్ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి దిగ్భ్రాంతి..
పెండ్లి పాక దుర్ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండ్లిపాక దుర్ఘటన దురదృష్టకరం అని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ఇంకెప్పుడూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. వేసవికాలంలో తమ చిన్నారుల కదలికలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. రిజర్వాయర్, చెరువు ఉన్న ప్రాంతాల్లో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుంది అని మంత్రి సూచించారు.