హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ను సిట్ దాఖలు చేసింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు ప్రముఖులపై అభియోగాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్లో కలకలం రేపిన డ్రగ్స్ దందాపై ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ నేతృత్వంలోని సిట్ పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులను గతంలో విచారించిన సంగతి తెలిసిందే.
వీరిలో ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరిశీలన నిమిత్తం పంపిన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక రావడంతో వారిపై ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. వీరిలో ఇద్దరి శాంపిల్స్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరికి సంబంధించిన ల్యాబ్ నివేదిక కోర్టుకు చేరిందట. మరికొందరికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉందని, అది చేరిన తరువాత వారిపై మరో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
కెల్విన్ అనే డ్రగ్ డీలర్‌ను ఎక్సైజ్‌శాఖ పట్టుకోవడంతో టాలీవుడ్లో 'డ్రగ్స్' ప్రకంపనలు మొదలయ్యాయి. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో టాలీవుడ్‌కు చెందిన పది మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఎక్సైజ్ అధికారులు ఒక్కోరోజు ఒక్కొక్కరినీ ప్రశ్నించారు. ముగ్గురి నుంచి రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనను పంపారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక అందడంతో ముగ్గురిపై సిట్ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.