హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో షెడ్యూల్కన్నా ముందే స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయి. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఏప్రిల్ 13 నుంచి విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల 12న చివరి పనిదినం కావడంతో ప్రతి ఉపాధ్యాయుడు విధులకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
స్కూళ్లు తిరిగి జూన్ 1న పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. జూన్ 2న తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాఠశాలలలో వేడులకను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఏప్రిల్ 23న స్కూళ్లకు చివరి పనిదినంగా ఉండాలి. జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం కావాలి. అయితే ఆవిర్భావ వేడుకల కోసమే ఈ తేదీలలో మార్పు చేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వేసవి సెలవులను ఏప్రిల్ 13 నుంచి మే 31వరకు ఇచ్చి, జూన్ 1 నుంచి తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది.