కామన్వెల్త్ క్రీడల్లో మరో సంచలనం నమోదైంది. భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ 75 కేజీల విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కెమెరూన్ బాక్సర్ డియోడాన్ విల్ఫ్రెడ్తో జరిగిన హోరాహోరి పోరులో 5-0 స్కోరులో విజయాన్ని కైవసం చేసుకున్న వికాస్ కృష్ణన్, మనదేశానికి ఈ గేమ్స్‌లో 25వ బంగారు పతకాన్ని అందించాడు. హర్యానాలోని హిసార్ ప్రాంతానికి చెందిన వికాస్ కృష్ణన్ యాదవ్ ఫిబ్రవరి 10, 1992లో జన్మించాడు.
10 ఏళ్ల వయసులోనే బివానీ బాక్సింగ్ క్లబ్బులో చేరిన వికాస్, ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన హర్యానా స్టేట్ విద్యుత్ బోర్డులో ఉద్యోగి. 2010లో ఇరాన్లో జరిగిన ఆసియన్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో యాదవ్ తొలిసారిగా అంతర్జాతీయ మెడల్ గెలుచుకున్నాడు
2014 ఆసియన్ క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న వికాస్, 2015 ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అదే సంవత్సరం జరిగిన ప్రపంచ అమెచ్యుర్ బాక్సింగ్ పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ వెళ్లాడు. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో కూడా క్వార్టర్ ఫైనల్స్ వరకూ వెళ్లాడు. ప్రస్తుతం వికాస్ మిడిల్ వెయిట్ విభాగంలో పోటీ పడుతున్నాడు. 2012లో వికాస్‌ను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది