మోదీజీ బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేశారు : రాహుల్ గాంధీ

హైదరాబాద్, వదోదర, వారణాసి, భోపాల్, పాట్నా, ఢిల్లీలాంటి నగరాల్లో నగదు కొరత

Last Updated : Apr 18, 2018, 10:12 AM IST
మోదీజీ బ్యాంకింగ్ రంగాన్ని నాశనం చేశారు : రాహుల్ గాంధీ

ఇటీవల కాలంలో అనేక చోట్ల బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల ముందు నగదు విత్‌డ్రా కోసం భారీ క్యూలు దర్శనం ఇస్తున్నప్పటి.. చాలా చోట్ల ఏటీఎంలలో నగదు లేదు అనే బోర్డ్ కనిపించడమైనా జరుగుతోంది లేదంటే.. ఏటీఎంలు పనిచేయడం లేదు అనే బోర్డ్ అయినా వేళ్లాడుతోంది. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే దుస్థితి నెలకొంది అనే నివేదికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని మొత్తం నాశనం చేశారని మోదీపై ఆరోపణలు గుప్పించారు. ఇటీవల వెలుగుచూసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణాన్ని వేలెత్తి చూపిస్తూ.. ఓవైపు వజ్రాల వ్యాపారి రూ.30,000 కోట్లతో దేశం విడిచిపెట్టి పారిపోతోంటే, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మౌనంగా చూస్తుండిపోయారు అంటూ మోదీపై మండిపడ్డారు.

 

నోట్ల రద్దు పేరుతో రూ.500, రూ.1,000 నోట్లు లాక్కొని నిరవ్ మోదీ లాంటి వాళ్ల జేబుల్లో కుక్కారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, రాఫెల్ లాంటి వివాదాలపై పార్లమెంట్‌లో మాట్లాడాలంటే ప్రధానికి నోరు రాదు. కేవలం 15 నిమిషాలైనా ఆ వివాదాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరినా, అందుకు మోదీ సంసిద్ధంగా లేరు అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. హైదరాబాద్, వదోదర, వారణాసి, భోపాల్, పాట్నా, ఢిల్లీలాంటి నగరాల్లో నగదు కొరతతో పౌరులు చాలా ఇక్కట్లు పడుతున్నారనే కథనాల నేపథ్యంలోనే మోదీపై రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు.

Trending News