Emergency In India, Today in History : ఎమర్జెన్సీ.. అచ్చతెలుగులో చెప్పాలంటే అత్యవసర స్థితి... అసలు ఈ మాట వింటేనే నిలువెల్లా వణుకు పుడుతుంది. ఇందిరాగాంధీ ప్రధానిగాఉన్న సమయంలో దేశ సార్వభౌమాధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకున్న అత్యంత నియంతృత్వమైన నిర్ణయం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజలు, న్యాయస్థానాలు తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు.. ప్రతికూల నిర్ణయాలు వెలువడుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. స్వతంత్ర భారత దేశంలో అత్యంత క్రూరమైన, అనర్థమైన నిర్ణయం ఇదే అంటారు విశ్లేషకులు. అంతేకాదు. ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణిస్తారు. ప్రజల హక్కులను కాలరాసే ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని వాదిస్తారు. కానీ, అప్పుడు ఆ కాలంలో ఇది సాధ్యమయ్యింది. దేశం మొత్తంమీద ప్రజలకు కనీస ప్రాథమిక హక్కులు కూడా దక్కని పరిస్థితి దాపురించింది. ఢిల్లీలో కూర్చొని దేశం మొత్తం మీద అధికారం చెలాయించవచ్చన్న అధికార ఆలోచనకు పరాకాష్టగా నిలిచింది.
సరిగ్గా 47 సంవత్సరాల క్రితం ఇవాల్టి రోజున ఈ నిర్ణయం తీసుకున్నారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. 1975 జూన్ 25వ తేదీన దేశంలో ఎమర్జెన్సీని విధించారు. భారత రాజ్యాంగంలోని అధికరణం 352(1) కింద అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి రాజ్యాంగంలో నిర్దేశించిన అంతర్గత అత్యవసర స్థితిని ఇందిరాగాంధీ వినియోగించుకున్నారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25వ తేదీ అర్థరాత్రి గం॥ 11.45 నిమిషాలకు అధికారికంగా దేశంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ అత్యవసర స్థితి దేశవ్యాప్తంగా 1977వ సంవత్సరం మార్చి 21వ తేదీన ఆ ఆదేశాలను ఉపసంహరించే దాకా కొనసాగింది. తన ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను కూడా ఆపేసి, ప్రశ్నించే పౌరహక్కులను కూడా అడ్డుకునే అధికారాన్ని ఈ అధికరణం ప్రధాన మంత్రికి అందించింది. ప్రజల కనీస హక్కులను కూడా ఈ అధికరణం కాలరాస్తుంది. ఎమర్జెన్సీ కాలంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారు. పత్రికలపై సెన్సార్ విధించారు. అంటే, పత్రికల్లో వచ్చే వార్తలు సైతం ముందుగా ప్రధానమంత్రి కార్యాలయానికి చూపించాలన్నమాట. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాలు, కాలాల గురించి చర్చించుకుంటే దేశంలో అత్యవసర స్థితి-ఎమర్జెన్సీని ప్రధానంగా చెప్పుకుంటారు.
21 నెలల పాటు కొనసాగిన నియంత పాలన..
ఎమర్జెన్సీ కారణంగా దేశంలో 21 నెలల పాటు నియంతృత్వం రాజ్యమేలింది. 1977 ఎన్నికల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఘోర పరాజయంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిందని ఇప్పటికీ విశ్లేషకులు చెబుతారు. అందుకే జూన్ 25వ తేదీని ప్రజాస్వామ్యానికి చీకటిరోజుగా ఇప్పటికీ అభివర్ణిస్తారు. దేశంలో అంతర్గతంగా అలజడి చెలరేగిందన్న కారణంతో ఆనాడు ఎమర్జెన్సీ విధించారు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. ఆ తర్వాత ఈ అధికరణం ద్వారా తనకు వర్తించిన విస్తృతమైన అధికారాలను వినియోగించుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులందరినీ జైలుకు పంపించారు.
దేశంలో ఎమర్జెన్సీ అంటే అత్యయిక స్థితిని విధించిన వెంటనే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం మొదలయ్యింది. ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎక్కడికక్కడ అణచివేశారు. పత్రికలపై ఏనాడూ లేని రీతిలో నియంత్రణ విధించారు. ఈ అరాచకం దేశవ్యాప్తంగా 1977వ సంవత్సరం మార్చి 21వ తేదీ వరకు అంటే 21 నెలలపాటు సాగింది.
ఇందిరా గాంధీని కలవరపెట్టిన కాంగ్రెసేతర పార్టీలు..
దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు 1971 సాధారణ ఎన్నికల్లో గరీబీ హఠావో నినాదంతో కాంగ్రెస్ పార్టీ 352 పార్లమెంటు నియోజకవర్గాలను గెలుచుకుంది. అదే సమయంలో రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో తిరుగులేని మెజారిటీ ఉందన్న గర్వంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజా సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరోవైపు.. ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో బలపడ్డాయి. రాజకీయంగా, ఆర్థికంగా కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు స్వతంత్రంగా వ్యవహరించాయి. దీంతో, ఈ పరిణామాలన్నీ వెరసి నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కలవరపెట్టాయి.
న్యాయవ్యవస్థను కూడా ప్రభుత్వం నియంత్రించవచ్చా ?
న్యాయవ్యవస్థను కూడా ప్రభుత్వం నియంత్రించవచ్చన్న పరిణామాలకు సాక్ష్యంగా ఎమర్జెన్సీ నిలిచింది. ప్రజలకు అవసరమైన మౌలిక అంశాలు, ప్రాథమిక హక్కులను ఏవైనా శక్తులు ప్రభావితం చేస్తున్నప్పుడు పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవద్దని గోలక్ నాథ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఈ తీర్పును కూడా ఇందిరాగాంధీ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం.. రాజ్యాంగ సవరణలు కూడా చేయొచ్చని నిరూపించింది. దీంతో ప్రజాస్వామ్యంలోని ఓ పిల్లర్ అయిన న్యాయవ్యవస్థను కూడా ప్రభుత్వ మే నియంత్రించవచ్చన్న నియంతృత్వానికి అప్పటి పరిణామాలు నిదర్శనంగా నిలిచాయి.
ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని హై కోర్టు సంచలన తీర్పు..
దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ అక్రమాలకు పాల్పడ్డారని, ఆ ఎన్నికను రద్దు చేయాలని అప్పటి ఎన్నికల్లో ఆమె ప్రధాన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన తరపున ప్రముఖ రాజకీయ నాయకుడు, న్యాయవాది శాంతిభూషణ్ వాదించారు. దీనిపై విచారించిన అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12వ తేదీన సెన్సేషనల్ తీర్పు వెలువరించింది.
అయితే హైకోర్టు తీర్పుపై ఇందిరాగాంధీ రాజీనామా చేయకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జూన్ 25వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రధాని పదవిలో ఉండవచ్చని పేర్కొన్నా.. తుది తీర్పు వెలువడే దాకా ఇందిర ఎంపీగా కొనసాగకూడదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఓటు వేసే అధికారం ఇందిరాగాంధీకి ఉండదని న్యాయమూర్తి పేర్కొన్నారు. చీకటిరోజుగా అభివర్ణించే జూన్ 25వ తేదీకి ముందు కూడా భారత్‌లో రెండు సార్లు అత్యవసర పరిస్థితి విధించారు. 1962లో చైనాతో యుద్ధం జరిగిన సమయంలో తొలిసారి దీనిని ప్రయోగించారు. అలాగే, 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలోనూ దేశవ్యాప్తంగా అత్యవరసర పరిస్థితిని ప్రకటించారు. కానీ, 1975 జూన్ 25వ తేదీన విధించిన ఎమర్జెన్సీనే ఇప్పటికీ చీకటి కాలంగా అభివర్ణిస్తున్నారు.
Also Read : Draupadi Murmu : అత్యంత పేద కుటుంబం.. గృహహింస బాధితురాలు! ద్రౌపది ముర్ము జీవితం విషాదభరితం
Also read : Konaseema: కోనసీమలో మళ్లీ హై టెన్షన్.. వేలాది మంది పోలీసులతో పహారా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.