Kadem project floods live updates: తెలంగాణలో కుండపోత వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిధిలో గత 24 గంటల్లో కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ప్రాజెక్ట్ కెపాసిటీకి మించి వరద వస్తుండటంతో అధికారులు చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 4 లక్షల 97 వేల 413 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను పూర్తిగా ఎత్తి 2 లక్షల 99 వేల 047 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్ట్ డిశ్చార్జ్ సామర్ధ్యం మూడు లక్షల క్యూసెక్కులు మాత్రమే. కెపాసిటీ కి మించి వరద వస్తుండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాజెక్టుకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీగా వస్తున్న ఇన్ ఫ్లోతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో కడెం వాసులు వణికిపోతున్నారు.